Jolly O Gymkhana Aha | ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటించిన “జాలీ ఓ జింఖానా” సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమాను భవానీ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు ఆహాలో తీసుకువచ్చింది చిత్రయూనిట్. గతేడాది నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాని దర్శకుడు శక్తి చిదంబరం తెరకెక్కించారు. ఈ సినిమాని ప్రభుదేవా తన సొంత నిర్మాణ సంస్థ అయిన ప్రభుదేవా స్టూడియోస్‌లో నిర్మించారు. “జాలీ ఓ జింఖానా” సినిమాలో ప్రభుదేవాతో పాటు రెజీనా, పూజా కుమార్, యోగిబాబు, రోబో శంకర్, మడోన్నా స్టెబాస్టియన్, పూజిత పొన్నాడ, అభిరామి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి సంగీతం జస్టిన్ ప్రభాకరన్ అందించారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. తంగసామి అనే వ్యక్తి తన కూతురు చెల్లమ్మ (అభిరామి), మనవరాళ్లు భవానీ, యజాని, శివానీ (మడోన్నా సెబాస్టియన్)తో కలిసి ఒక బిర్యానీ సెంటర్‌ను నడుపుతుంటాడు. అనుకోకుండా స్థానిక ఎమ్మెల్యేతో చెల్లమ్మకు గొడవ జరుగుతుంది. ఆ ఎమ్మెల్యే మనుషులు తంగసామిని కొట్టడంతో అతను ఆసుపత్రి పాలవుతాడు. ఎమ్మెల్యేపై చట్టపరంగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్న చెల్లమ్మ, ఆమె కుమార్తెలు ఒక లాయర్‌ను (ప్రభుదేవా) కలుస్తారు. అలా ఉండగా, అనుకోకుండా భవానీ, శివానీ మరియు వారి కుటుంబం ఒక హత్య చేస్తారు. ఈ కేసు నుండి బయటపడటానికి వారు శవాన్ని ఒక బతికున్న వ్యక్తిగా నమ్మిస్తారు. అసలు వారు హత్య చేసింది ఎవరిని? బ్యాంకును మోసం చేసి పది కోట్లు ఎలా దోచుకున్నారు? అనేదే ఈ సినిమా కథ.