Jo Sharma | అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ “M4M (మోటివ్ ఫర్ మర్డర్)” మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. పి.వి.ఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రం ఇప్పటికే సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో చిత్ర కథానాయిక జో శర్మ మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా ముచ్చటించి సినిమా విశేషాలను పంచుకున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఆమె ఈ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం కావడం విశేషం. హైదరాబాద్‌లో పుట్టినప్పటికీ నాగ్‌పూర్, ముంబైలలో పెరగడం వల్ల తనకు తెలుగుతో పాటు హిందీ, మరాఠీ భాషలపై పట్టు ఉందని, అందుకే తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నానని ఆమె తెలిపారు.
ఈ సినిమాలో ‘రాధ’ అనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తున్న జో శర్మ, కేవలం నటిగానే కాకుండా ఈ చిత్రానికి కో-రైటర్‌గా కూడా వ్యవహరించారు. సినిమా విడుదల కాకముందే లాస్ ఏంజెల్స్, లండన్, న్యూయార్క్ వంటి ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ నుండి సుమారు 15 అవార్డులను గెలుచుకోవడం ఈ చిత్రానికి ఉన్న అతిపెద్ద బలం. ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాత ‘కేన్స్’ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రం గ్లోబల్ ప్రీమియర్ ప్రదర్శించబడినప్పుడు, విదేశీ ప్రేక్షకులు కూడా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారని ఆమె గర్వంగా పేర్కొన్నారు. సినిమా కథాంశం గురించి వివరిస్తూ, ఇది ప్రపంచంలోనే ఇప్పటివరకు రాని ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిందని ఆమె వెల్లడించారు. ఒక సీరియల్ కిల్లర్ హత్యలు చేసిన తర్వాత, ఆ మృతదేహాలను రాజా రవివర్మ, పికాసో వంటి గొప్ప చిత్రకారుల పెయింటింగ్స్ తరహాలో అలంకరించడం ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా ఉండబోతోంది.
మోహన్ మీడియా క్రియేషన్స్ మరియు మెక్ క్వీన్ గ్రూప్ అమెరికా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో సీట్ ఎడ్జ్ అనుభూతిని ఇస్తుందని జో శర్మ ధీమా వ్యక్తం చేశారు. సినిమాలో విలన్ ఎవరో కనిపెట్టిన వారికి ఒక లక్ష రూపాయల ప్రైజ్ మనీని కూడా ప్రకటించడం ప్రేక్షకుల్లో మరింత కుతూహలాన్ని పెంచుతోంది. తనకు యాక్షన్ ఓరియంటెడ్ పాత్రలంటే చాలా ఇష్టమని, భవిష్యత్తులో టాలీవుడ్‌లోని అగ్ర హీరోలందరితో కలిసి పనిచేయాలని ఉందని ఆమె ఆకాంక్షించారు. ‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’ అనిపించుకోవడమే తన లక్ష్యమని, మే 8న విడుదల కానున్న తమ చిత్రాన్ని ఆదరించి ఆశీర్వదించాలని ఆమె కోరారు.