సోనీలివ్: సెప్టెంబర్ 12
తారాగణం: బిజు మేనన్, ఆసిఫ్ అలీ, మియా జార్జ్ తదితరులు
దర్శకత్వం: జిస్ జోయ్
మలబారు తీరంలో కథలు చెట్లకు కాస్తాయేమో! అందుకే కాబోలు.. మాలీవుడ్‌లో వినూత్న కథలు విభిన్నంగా తెరకెక్కుతుంటాయి. ఫ్యామిలీ, థ్రిల్లర్, హారర్ ఇలా జానర్ ఏదైనా కేరళీయులు కథను తీసే విధానం హైలైట్‌గా నిలుస్తుంది. అందుకే.. మలయాళ చిత్రాలు ఓటీటీలో రికార్డు స్ట్రీమింగ్ నమోదు చేసుకుంటున్నాయి. తాజాగా సోనీలివ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న చిత్రం తలవన్. క్రైమ్ అండ్ పనిష్మెంట్ కథను ఇంత నాన్ వయొలెంట్‌గా తీయొచ్చా అని ఆశ్చర్యపరుస్తుంది ఈ సినిమా.
కథలోకి వెళ్తే.. సీఐ జయశంకర్ (బిజు మేనన్) స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. ఎస్ఐ కార్తిక్ (ఆసిఫ్ అలీ) బదిలీపై జయశంకర్ స్టేషన్‌కు వస్తాడు. కార్తిక్‌ది దుందుడుకు స్వభావం. ఈ ఇద్దరి మధ్యా పెద్దగా పోట్లాటలేం జరగవు కానీ, ఏదో గ్యాప్ అయితే ఉంటుంది. ఇదిలా ఉండగా ఒకసారి జయశంకర్ ఇంట్లో రమ్య అనే యువతి మృతదేహం దొరుకుతుంది. ఒక కేసు విషయమై రమ్య తరచూ జయశంకర్‌ను కలుస్తుంటుంది. దీంతో ఆమెకు, సీఐకి ఏదో సంబంధం ఉందని కొందరు ప్రచారం చేస్తారు. ఈ నేపథ్యంలో సీఐ ఇంట్లో రమ్య మృతదేహం దొరకడంతో.. ఆయనే ఆమెను హత్య చేశాడని అందరూ అనుకుంటారు.
జయశంకర్‌ను అరెస్టు చేస్తారు. ఎస్ఐ కార్తిక్ కేసు విచారణ చేపడతాడు. ఇంతకీ రమ్యను ఎవరు హత్య చేశారు? జయశంకర్ పాత్ర ఏంటి? కేసు విచారణలో ఎస్ఐ కార్తిక్ ఏం చేశాడు? అన్నది మిగిలిన కథ. ఆసక్తికరమైన మలుపులతో సినిమా సాగుతుంది. అక్కడక్కడా బోర్ కొట్టించినా.. తలవని ముగింపు ప్రేక్షకుడికి థ్రిల్ ఇస్తుంది.