Nikhil M Gowda | హారర్ మరియు సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన తాజా చిత్రం ‘జిన్’. సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్ మరియు బిల్వ స్టూడియోస్ బ్యానర్లపై నిఖిల్ ఎం. గౌడ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి చిన్మయ్ రామ్ దర్శకత్వం వహించారు. అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా, ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తించింది. అయితే డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఏ మేరకు థ్రిల్ కలిగించిందో ఇప్పుడు చూద్దాం.
కథ
ఈ సినిమా కథ జ్ఞాన వికాస్ కాలేజ్ మరియు దాని సమీపంలోని భూతనాల చెరువు చుట్టూ తిరుగుతుంది. పరీక్షలు రాసేందుకు నలుగురు కుర్రాళ్లు ఆ కాలేజీకి వెళ్తారు. అయితే, ఆ కాలేజీ లైబ్రరీలో రాత్రి వేళ అడుగుపెట్టిన వారికి వింత శబ్దాలు, భయంకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆ భవనం నుండి బయటపడాలని వారు చేసే ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. అసలు ఆ భవనంలో వారిని బంధించింది ఎవరు? ‘జిన్’ నేపథ్యం ఏమిటి? పోలీసుల విచారణలో తేలిన నిజాలేంటి? చివరకు ఆ నలుగురు ప్రాణాలతో బయటపడ్డారా లేదా? అనేదే ఈ చిత్ర కథ.
విశ్లేషణ:
దర్శకుడు చిన్మయ్ రామ్ హారర్ మరియు కామెడీని సమపాళ్లలో మిక్స్ చేసి కథనాన్ని నడిపించారు. సినిమా మొదటి భాగం అంతా కుర్రాళ్ల అల్లరి చిల్లరి చేష్టలు, కాలేజీ వాతావరణంతో సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్ సమయానికి వచ్చే ట్విస్ట్ కథను మలుపు తిప్పి, సెకండాఫ్ మీద ఆసక్తిని పెంచుతుంది. రెండో భాగంలో కథ వేగం పుంజుకుంటుంది. జిన్ ఎంట్రీ, పోలీస్ ఇన్వెస్టిగేషన్ మరియు ఆ భవనం వెనుక ఉన్న గతాన్ని రివీల్ చేసే సీన్లు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ వరకు ఉత్కంఠను కొనసాగిస్తూ, సెకండ్ పార్ట్‌కు ఇచ్చిన లీడ్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది.
నటీనటులు:
ఈ సినిమాలో అమిత్ రావ్ నటన ప్రధాన ఆకర్షణ. ముఖ్యంగా సెకండాఫ్‌లో తన కళ్లతోనే హావభావాలు పలికిస్తూ సెటిల్డ్ పర్ఫామెన్స్తో భయపెట్టారు. కీలక పాత్రలో నటించిన పర్వేజ్ చక్కని నటన కనబరిచారు. తెలుగు ప్రేక్షకులకు వీరు కొత్త ముఖాలైనా, తమ పాత్రల్లో ఒదిగిపోయి మెప్పించారు. హీరో స్నేహితులుగా నటించిన వారు తమ కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించగా, పోలీస్ ఆఫీసర్ పాత్రధారి హుందాగా నటించారు.
సాంకేతిక వర్గం:
సాంకేతికంగా ‘జిన్’ సినిమా ఉన్నత ప్రమాణాలతో ఉంది. సినిమాటోగ్రఫీ సునీల్ విజువల్స్ హారర్ మూడ్‌ను పర్ఫెక్ట్గా సెట్ చేశాయి. అలెక్స్ అందించిన సంగీతం థియేటర్లలో ప్రేక్షకులకు మంచి థ్రిల్‌ను ఇస్తుంది. నిర్మాత నిఖిల్ ఎం. గౌడ ఎక్కడా రాజీ పడకుండా సినిమాను రిచ్‌గా నిర్మించారు. లొకేషన్లు మరియు సెట్స్ సినిమాకు సహజత్వాన్ని ఇచ్చాయి.
ప్లస్ పాయింట్స్:
ఆకట్టుకునే హారర్ ఎలిమెంట్స్
అమిత్ రావ్ నటన
నేపథ్య సంగీతం మరియు విజువల్స్
సెకండ్ పార్ట్ లీడ్
మైనస్ పాయింట్స్:
అక్కడక్కడా సాగదీసినట్లు అనిపించే కొన్ని సీన్లు
తెలుగు ప్రేక్షకులకు నటీనటులు కొత్తవారు కావడం
చివరిగా
మొత్తానికి ‘జిన్’ చిత్రం హారర్ మరియు మిస్టరీ థ్రిల్లర్లను ఇష్టపడే ప్రేక్షకులకు ఒక మంచి విందు. నవ్విస్తూనే భయపెట్టడంలో దర్శకుడు విజయం సాధించారు. థియేటర్లలో ఒకసారి తప్పక చూడదగ్గ హారర్ ఎంటర్టైనర్ ఇది.
రేటింగ్: 2.75/5