యాక్షన్ ప్యాక్ట్ రోల్లో అలియాభట్ నటించిన బాలీవుడ్ చిత్రం ‘జిగ్రా’. ఆపదలో ఉన్న తమ్ముడికోసం అక్క చేసే పోరాటమే ఇతివృత్తంగా రూపొందిన ఈ చిత్రానికి వాసన్ బాలా దర్శకుడు. కరణ్ జోహార్, అపూర్వ మెహతా, షాహిన్ భట్, సోమెన్ మిశ్రాలతో కలిసి అలియాభట్ నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం అక్టోబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఏషియన్ సురేశ్ ఎంటైర్టెన్మెంట్స్ ద్వారా రానా దగ్గుబాటి ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్‌ని అగ్రహీరో రామ్‌చరణ్ విడుదల చేశారు. ‘జిగ్రా’ తెలుగు ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనున్నదని, అన్ని భాషల్లో సినిమాను విడుదల చేస్తామని, ఏషియన్ సురేశ్ సంస్థ ద్వారా రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడం ఆనందంగా ఉందని నిర్మాతల్లో ఒకరైన అపూర్వ మెహతా అన్నారు.
రానా మాట్లాడుతూ ‘ ‘జిగ్రా’ కథలోని సోల్‌కి ఏ భాష వారైనా కనెక్ట్ అవుతారు. ఇది కేవలం యాక్షన్ సినిమానే కాదు. కుటుంబంలోని అనుబంధాలను తెలిపే సినిమా. అక్కా, తమ్ముళ్లుగా అలియా, వేదాంగ్ రైనా అద్భుతంగా నటించారు.’ అని రానా చెప్పారు.