‘జిగర్ తాండ’ ఫస్ట్ పార్ట్‌లోనే నేను యాక్ట్ చేయాల్సింది. అప్పుడు వేరే ప్రాజెక్ట్‌లో బిజీగా ఉండటం వల్ల కుదర్లేదు. ఆ తర్వాత నేనే కార్తీక్ సుబ్బరాజ్ దగ్గరకెళ్లి ‘జిగర్ తండా’ సీక్వెల్ చేద్దామని అడిగాను. తను కథ తయారు చేయడానికి సమయం పడుతుందని అన్నాడు. కథ రెడీ అవ్వగానే నాకు ఫోన్ చేశాడు’ అన్నారు హీరో లారెన్స్. ఆయన కథానాయకుడిగా, కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జిగర్ తాండ డబుల్ ఎక్స్’. కార్తికేయన్ నిర్మించిన ఈ చిత్రం నెల 10న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా లారెన్స్, ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర పోషించిన ఎస్.జె.సూర్య మీడియాతో సరదాగా ముచ్చటించారు. ఇది పీరియాడిక్ మూవీ అని, నేపథ్యం కొత్తగా ఉంటుందని, యాక్షన్, ఎమోషన్ కలగలిసిన కథాంశంతో రూపొందిన చిత్రం ఇదని లారెన్స్ అన్నారు. త్వరలోనే ముని 5, కాంచన 4 చిత్రాలను మొదలుపెట్టనున్నానని లారెన్స్ చెప్పారు.
హైదరాబాద్‌లో రాఘవేంద్రస్వామి గుడి కట్టాలనే నిశ్చయంతో ఉన్నానని, తన సేవా కార్యక్రమాలు తెలుగునేలపై కూడా కొనసాగిస్తానని లారెన్స్ చెప్పారు. వందకోట్ల భారీ వ్యయంతో ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ చిత్రాన్ని నిర్మాత కార్తికేయన్ నిర్మించారని, ఇందులో లారెన్స్ గ్యాంగ్‌స్టార్‌గా, నేనేమో డైరెక్టర్ కావాలని తపించే వ్యక్తిగా నటిస్తున్నామని ఎస్. జె.సూర్య అన్నారు.