Jayasudha | తెలుగు సినీ పరిశ్రమకు గద్దర్ అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. 2014 జూన్ నుంచి డిసెంబర్ 2023 వరకు విడుదలైన సినిమాలకు ఈ ఏడాది అవార్డులను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. గద్దర్ పేరుతో నిర్వహించనున్న ఫిల్మ్ అవార్డుల కోసం ప్రత్యేకంగా జ్యూరీ కమిటీని బుధవారం నియమించారు. చైర్‌పర్సన్‌గా ప్రముఖ నటి జయసుధ నియామకమయ్యారు. జ్యూరీ కమిటీ మొత్తం 15 మంది సభ్యులంటారు. ఈ క్రమంలో జయసుధ అధ్యక్షతన కమిటీ తొలి సమావేశం బుధవారం జరిగింది.
నగరంలోని ఎఫ్డీసీ మీటింగ్‌లో హాల్లో జరిగిన సమావేశంలో టీఎఫ్‌డీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు పాల్గొన్నారు. ప్రభుత్వం 14 సంవత్సరాల తర్వాత సినీ రంగానికి అవార్డులను ఇస్తున్నదని.. గద్దర్ అవార్డులకు జాతీయస్థాయి గుర్తింపు దక్కేలా జ్యూరీ సభ్యులు చర్యలు తీసుకోవాలన్నారు. అవార్డుల కోసం ఈ సారి 1,248 నామినేషన్లు అందాయి. వ్యక్తిగత కేటరిలో 1172, ఫీచర్ సినిమాలు, బాలల చిత్రాలు, డాక్యుమెంటరీలు సహా వివిధ విభాగాల సినిమాలకు 76 దరఖాస్తులు వచ్చాయని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ హరీశ్ పేర్కొన్నారు. ఈ నెల 21 నుంచి స్క్రీనింగ్ జరుగుతుందని, అనంతరం అవార్డులు ప్రకటించనున్నట్లు జ్యూరీ సభ్యులు వివరించారు.