Jayam Ravi | ప్రముఖ తమిళ నటుడు రవి మోహన్ (జయం రవి) నివాసంలో చోటుచేసుకున్న దొంగతనం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆయన వ్యక్తిగత కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.2.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇంకా కనిపించకుండా పోయిన రూ.10 లక్షల విలువైన వజ్రాల నెక్లెస్ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. చెన్నైలోని ఇంజంబాక్కంలో ఉన్న రవి మోహన్ నివాసంలో జూన్ 22న విలువైన నగదు, ఆభరణాలు కనిపించకపోవడంతో ఆయన మేనేజర్ నీలన్‌కరై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మొదట ఇంట్లో పనిచేసే సిబ్బందిపైనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో వారిని ఇంట్లోనే బంధించి విచారిస్తున్నారనే సమాచారం పోలీస్ కంట్రోల్ రూమ్‌కు చేరడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు మహిళా సిబ్బందితో పాటు ఒక బాలుడిని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు. దొంగతనం జరిగిందని అనుమానం ఉన్నా, చట్టపరమైన ప్రక్రియను అనుసరించాలని, ఎవరినీ స్వయంగా నిర్బంధించి విచారించకూడదని ఇంటి నిర్వాహకులకు సూచించారు. ఆ తర్వాత రవి మోహన్ మేనేజర్ అధికారిక ఫిర్యాదులో ఇంటి లాకర్ నుంచి రూ.10 లక్షల నగదు, ఒక విలువైన డైమండ్ నెక్లెస్ కనిపించడం లేదని పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఇంట్లో పనిచేసే సిబ్బంది, డ్రైవర్ సహా అందరినీ విడివిడిగా విచారించారు.
విచారణలో గత ఆరు నెలలుగా రవి మోహన్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజేష్ ప్రవర్తనపై పోలీసులకు అనుమానం కలిగింది. అతడిని సుదీర్ఘంగా ప్రశ్నించగా, లాకర్‌ను తెరిచి నగదును తానే దొంగిలించినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. నిందితుడి వద్ద నుంచి రూ.2.5 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని తిరిగి రవి మోహన్ కుటుంబానికి అప్పగించారు. అయితే ఫిర్యాదులో పేర్కొన్న రూ.10 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ మాత్రం ఇప్పటికీ లభ్యం కాలేదు. దానిని నిందితుడు ఎక్కడ దాచాడన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.అరెస్ట్ చేసిన రాజేష్‌ను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతడిని జ్యుడిషియల్ కస్టడీకి తరలించింది. ఈ కేసులో మరెవరైనా ప్రమేయం ఉందా? దొంగిలించిన ఆభరణం ఎక్కడికి వెళ్లింది? అనే అంశాలపై పోలీసులు మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.