Jaya Bachchan – Mukul Dev | బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్ కన్నుమూసిన విషయం తెలిసిందే. శుక్రవారం అర్థరాత్రి ముకుల్ తుదిశ్వాసను విడిచారు. నేడు ఆయన అంత్యక్రియాలు జరుగునున్నాయి. ఇక తెలుగులో కృష్ణ, ఏక్ నిరంజన్, అదుర్స్ తదితర సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ముకుల్ సినీ ఎంట్రీకి సంబంధించి ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. తన మొదటి సినిమా ‘దస్తక్’ విడుదలకు ముందే, అమితాబ్ బచ్చన్ నిర్మాణ సంస్థ ABCL (అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్) ద్వారా ముకుల్ దేవ్ లాంచ్ కావాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం జయా బచ్చన్ స్వయంగా ముకుల్ దేవ్ కు రూ. 75,000 సైనింగ్ అమౌంట్ ఇచ్చారని సమాచారం.
ఒక ఇంటర్వ్యూలో ముకుల్ దేవ్ మాట్లాడుతూ, “నా మొదటి సంపాదన రూ. 75,000. ABCL సినిమా కోసం జయా బచ్చన్ గారు వాటిని ఇచ్చారు. ఆమె నన్ను కలిసినప్పుడు, ‘నేను నిన్ను తెరపై లాంచ్ చేయాలనుకుంటున్నాను. మేము మూడు సినిమాలు చేస్తున్నాము, వాటిలో ఒక సినిమా నువ్వు మా దగ్గర ఖచ్చితంగా చేస్తావు. ఏ సినిమా చేస్తావో నాకు తెలియదు కానీ, నువ్వు మా దగ్గర ఒక సినిమా చేస్తావు’ అని అన్నారు” అని గుర్తు చేసుకున్నారు. మొదట జయా బచ్చన్ కాల్ చేసి సినిమా ఆఫర్ చేశారంటే తాను నమ్మలేకపోయానని, జోక్ చేస్తున్నారేమో అనుకున్నానని ముకుల్ దేవ్ తెలిపారు.
అయితే, ‘నామ్ క్యా హై’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ABCL ఆర్థిక సంక్షోభం కారణంగా ఎప్పుడూ విడుదల కాలేదు. ఆ సమయంలో అమితాబ్ బచ్చన్ సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది, దానితో పాటు అనేక సినిమాలు నిలిచిపోయాయి. దీనిపై ముకుల్ దేవ్ మాట్లాడుతూ, “అవును, సినిమా పూర్తయింది కానీ ఎప్పటికీ విడుదల కాలేదు. ABCL ఆర్థిక సంక్షోభంలో ఉంది, ఆ సమయంలో సంస్థ నిర్మించిన మరికొన్ని సినిమాలు కూడా విడుదల కాలేదు” అని చెప్పారు.
మహేష్ భట్ దర్శకత్వంలో వచ్చిన ‘దస్తక్’ (1996) సినిమాతో ముకుల్ దేవ్ అధికారికంగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ చిత్రంలో సుస్మితా సేన్‌తో కలిసి నటించారు. అయినప్పటికీ, జయా బచ్చన్ నుండి అందుకున్న రూ. 75,000 తన నటనా జీవితంలో మొదటి ఆదాయమని ముకుల్ దేవ్ తెలిపారు. ఇటీవల 54 ఏళ్ల వయసులో కన్నుమూసిన ముకుల్ దేవ్, హిందీ, పంజాబీ, దక్షిణ భారత సినిమాలు, టెలివిజన్ రంగంలో తన విలక్షణమైన నటనతో గుర్తింపు పొందారు.