Jawan Movie Song | పఠాన్ వంటి అరి వీర భయంకర హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో జవాన్‌పై ఓ రేంజ్లో అంచనాలు నెలకొన్నాయి. పైగా మూడు వారాల కిందట రిలీజైన ట్రైలర్ బాలీవుడ్ నాట సంచలనాలు సృష్టిస్తుంది. ప్రస్తుతం హిందీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం కాచుకుని ఎదురు చూస్తున్నారు. పఠాన్‌కు మించి ఉండబోతుందని ఇప్పటి నుంచి పలువురు ఎనాలసిస్లు చేసేస్తున్నాడు. ఇక బాలీవుడ్ ట్రేడ్ అయితే పక్కా ఇది షారుఖ్‌కు మరో వెయ్యి కోట్ల బొమ్మ అని స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. నిజానికి పఠాన్‌లో అంత మ్యాటర్ లేకపోయినా.. ఒక్క షారుఖ్ క్రేజ్‌తోనే సినిమా కోట్లు కొల్లగొట్టింది. ఇక ఇప్పుడు ఆ క్రేజ్‌కు అట్లీ అదిరిపోయే కథను వండి విందుకు రెడీ చేస్తున్నాడు.
సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై దక్షిణాది ప్రేక్షకులు సైతం అమితాసక్తితో ఉన్నారు. ఇక వచ్చే నెల నుంచి ఈ సినిమా ప్రమోషన్లు షురూ చేయనున్నట్లు టాక్. ఇక ప్రమోషన్లో భాగంగా తొలి పాట జిందా బందా అనే పెప్పి నెంబర్‌ను ఆగస్టు మొదటి వారంలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ పాటకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ హిందీ నాట హాట్ టాపిక్‌గా మారింది. ఈ పాటకైన ఖర్చు అక్షరాల రూ.15 కోట్లట. వెయ్యి మంది లేడీ డ్యాన్సర్లతో ఈ సాంగ్‌ను కొరియోగ్రాఫర్ శోభి నేతృత్వంలో తెరకెక్కించారట. షారుఖ్ కెరీర్లోనే అత్యధిక ఖర్చుతో కూడుకున్న పాట ఇదేనట. ఒక్క పాట కోసం అంత ఖర్చు పెట్టారంటే.. అందులో అంతలా ఏముంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
అనిరుధ్ మాస్ బీట్‌కు షారుఖ్ అదిరిపోయే స్టెప్పులు చూడ్డానికి రెండు కళ్లు చాలవని ఇన్సైడ్ టాక్. ఇక ఇప్పటికే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులన్ని కలుపుకుని భారీ స్థాయిలో బిజినెస్ జరిగిదని, విడుదలకు ముందే సినిమాకు మూడొందల కోట్లు లాభాలు వచ్చాయని సమాచారం. అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. షారుఖ్‌కు జోడీగా నయనతార నటించింది.