నిజంగా జాన్వీకపూర్ లక్కీ హీరోయిన్. తెలుగులో ఎంట్రీ ఇస్తూనే రెండు భారీ సినిమాల్లో కథానాయికగా అవకాశాలను దక్కించుకుంది. ఈ భామ అరంగేట్ర చిత్రం ‘దేవర’ షూటింగ్ జరుగుతుండగానే.. మరో అగ్ర హీరో రామ్‌చరణ్ సరసన నాయికగా ఛాన్స్ కొట్టేసింది. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌చరణ్ నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రంలో జాన్వీకపూర్‌ను కథానాయికగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
ఈ రెండు పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. తెలుగులో భారీ సినిమా అవకాశాలతో జాన్వీకపూర్ చాలా ఆనందంగా ఉందట. తన తల్లి, దివంగత శ్రీదేవిని ఆదరించినట్లగానే తెలుగు ప్రేక్షకులు తనపై ప్రేమాభిమానాలు చూపిస్తారనే నమ్మకంతో ఉందట. ఈ నేపథ్యంలో తాను తెలుగు భాషలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపింది జాన్వీకపూర్. ఇక నుంచి ఈ రెండు చిత్రాల సెట్స్‌లో తెలుగులోనే కమ్యూనికేట్ చేస్తానని, భవిష్యత్తులో హిందీతో పాటు టాలీవుడ్‌కు సమ ప్రాధాన్యం ఇస్తానని జాన్వీకపూర్ పేర్కొంది.