Janhvi Kapoor | తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి అంటే కథానాయిక జాన్వీకపూర్‌కు అపరిమితమైన భక్తి. ప్రతి ఏడాది రెండు మూడుసార్లు శ్రీవారిని దర్శించుకుంటుంది. తన పుట్టిన రోజుతో పాటు, అమ్మ దివంగత శ్రీదేవి జయంతి సందర్భంగా తిరుమలకు రావడం ఆమె ఆనవాయితీగా పెట్టుకుంది. ఎప్పుడు తిరుమల దేవస్థానం ప్రస్తావన తీసుకొచ్చినా జాన్వీకపూర్ ఆనందంతో పొంగిపోతుంది. తాజాగా ఓ టాక్‌షోలో పాల్గొన్న ఈ అందాల తార తిరుమల దేవస్థానంపై మరోమారు భక్తిభావాన్ని చాటుకుంది. పెళ్లయిన తర్వాత భర్తతో కలిసి తిరుపతిలో సెటిల్ అవ్వాలనే ఆలోచన ఉందని చెప్పింది.
అక్కడ సాధారణ జీవితాన్ని గడపాలన్నది తన కల అని, అరిటాకులో భోజనం చేస్తూ , నిత్యం గోవింద నామస్మరణ వింటూ కాలం గడపాలని కోరుకుంటున్నానని తెలిపింది. ముగ్గురు పిల్లల్ని కని అక్కడే ప్రశాంతగా సెటిల్ కావాలనుకుంటున్నానని, తిరుమల సంప్రదాయానికి అనుగుణంగా తన భర్తను కూడా లుంగీ ధరించమని చెబుతానని జాన్వీకపూర్ పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. గత ఏడాది ‘దేవర’ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం రామ్‌చరణ్‌తో కలిసి విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నది.