రామ్‌చరణ్ ‘పెద్ది’ చిత్రంలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్య స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకుడు. వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమాలో జాన్వీకపూర్ అచ్చియ్యమ్మ అనే పాత్రలో కనిపించనుంది. శనివారం ఆమె పాత్ర తాలూకు ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌ను విడుదల చేశారు.
ఓ స్టిల్‌లో జీప్‌పై నిలబడి చుట్టూ ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ కనిపిస్తుండగా, మరో స్టిల్‌లో సన్‌గ్లాసెస్ ధరించి మైక్ ముందు ైస్టెలిష్‌గా కనిపిస్తున్నది. ఈ సినిమాలో అచ్చియ్యమ్మ పాత్ర ఫైర్‌బ్రాండ్ తరహాలో ఉంటుందని, ఎవరికీ భయపడక ధైర్యంగా ముందుకుసాగే మహిళగా ఆమె క్యారెక్టర్ ఆకట్టుకుంటుందని చిత్రబృందం పేర్కొంది. శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఏ.ఆర్.రెహమాన్, సమర్పణ: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, నిర్మాత: వెంకట సతీష్ కిలారు, రచన-దర్శకత్వం: బుచ్చిబాబు సానా.