Janhvi Kapoor |బాలీవుడ్ గ్లామర్ డాల్ జాన్వీ కపూర్ ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. లెజెండరీ నటి శ్రీదేవి కుమార్తె కావడంతో ఆమె ప్రతి మాట, ప్రతి నిర్ణయం నెటిజన్లలో చర్చనీయాంశమవుతాయి. తాజాగా జాన్వీ చాలా కాలంగా సాగుతున్న “ప్లాస్టిక్ సర్జరీ” వాదనలపై స్పందించి, అందరికీ క్లారిటీ ఇచ్చింది. కాజోల్, ట్వింకిల్ హోస్ట్ చేసిన టాక్ షో “టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్” లో పాల్గొన్న జాన్వీ కపూర్ ఈ విషయంపై ఓపెన్‌గా మాట్లాడింది. “అవును, నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. కానీ అది తల్లి శ్రీదేవి మార్గదర్శకత్వంలోనే జరిగింది” అని స్పష్టం చేసింది.
జాన్వీ మాట్లాడుతూ, నా ప్రతి నిర్ణయం వెనుక అమ్మ సలహా ఉంది. ఆమె అనుభవం వల్లనే నేను తప్పులు చేయకుండా ముందుకు వచ్చాను. యువతులు సోషల్ మీడియాలో చూసినదాన్ని బ్లైండ్‌గా ఫాలో అవ్వకూడదు. ఎవరో చేసినట్టు మనం సర్జరీ చేయించుకోవాలని అనుకోవడం ప్రమాదకరం. అందుకే పారదర్శకత చాలా ముఖ్యం” అని జాన్వీ సూచించింది. జాన్వీ ఈ సందర్భంలో “బఫెలో-ప్లాస్టీ” అనే పదంపై కూడా స్పందించింది. తాను ఏ సర్జరీలు చేయించుకుందో వివరించకపోయినా, ఇకపై దాచిపెట్టేది ఏదీ ఉండదని చెప్పింది. “ఇక నుంచి నేను ఓపెన్ బుక్లా ఉంటాను. నేను ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా వాటిని బహిరంగంగానే చెబుతాను” అని స్పష్టంగా తెలిపింది.
సోషల్ మీడియాలో తన రూపం, దుస్తులు, బ్యూటీ ట్రీట్మెంట్లపై వస్తున్న విమర్శల గురించి మాట్లాడుతూ, “మన శరీరాన్ని మనం అంగీకరించడం సిగ్గు కాదు. సోషల్ మీడియా మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయవచ్చు, కానీ మనం నిజాయితీగా ఉండటం ముఖ్యం” అని జాన్వీ పేర్కొంది. అమ్మ ఎప్పుడూ నా బలం. నా ప్రతి అడుగులో ఆమె ముద్ర ఉంటుంది. ఆమె నన్ను ప్రేమతో చూసుకునేది, మార్గదర్శకురాలిగా ఉండేదని పేర్కొంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా “పెద్ది” షూటింగ్లో బిజీగా ఉంది. అంతకుముందు ఆమె దేవర చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది.