Janhvi Kapoor | అల్లు అర్జున్‌కు గతేడాది బాగానే కలిసి వచ్చింది. ఐకాన్ స్టార్ నటించిన పుష్ప-2 మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రూ.2వేలకోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. పుష్ప తర్వాత బన్నీ ఏం సినిమా చేయబోతున్నాడనే చర్చ సాగుతున్నది. సమాచారం మేరకు అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయనున్నాడనే వార్త తెగ వైరల్‌గా మారింది. అయితే, ఈ ప్రాజెక్టు కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని.. ఈ మూవీని పక్కన పెట్టి బన్నీ తమిళ ప్రముఖ దర్శకుడు అట్లీతో సినిమా చేయనున్నాడని ప్రచారం జరుగుతున్నది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ, అలనాటి అందాల తార శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్‌ను హీరోయిన్గా తీసుకోనున్నట్లు తెలుస్తున్నది.
చాలారోజులుగా బన్నీతో అట్లీ సినిమా చేయాలనుకుంటున్నాడు. ఇద్దరి కాంబోలో హై యాక్షన్ సినిమా తెరకెక్కించనున్నట్లు టాక్ నడుస్తున్నది. త్వరలోనే వివరాలను ప్రకటించనున్నారు. ఇక అల్లు అర్జున్‌తో జాన్వీ కపూర్ రొమాన్స్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ విషయంపై ఇప్పటి వరకు ఎవరూ అధికారిక ప్రకటన చేయలేదు. జాన్వీ కపూర్ తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినా.. జాన్వీ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదని వార్తలు వచ్చాయి. దేవర మూవీ రెండు భాగాలుగా తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. సెకండ్ పార్ట్‌లోనైనా జాన్వీ పాత్రకు న్యాయం చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ప్రస్తుతం తెలుగులోనే ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తున్నది. అయితే, నాని హీరోగా నటిస్తున్న ఓ సినిమాలోనూ జాన్వీ కపూర్‌ని తీసుకున్నారని వార్తలు వచ్చినా అందులో నిజం లేదని తేలిపోయింది. తాజాగా వస్తున్న వార్తల నేపథ్యంలో అల్లు అర్జున్, అట్లీ సినిమాలో జాన్వీని హీరోయిన్గా తీసుకుంటే తెలుగులో మూడో చిత్రం కానున్నది. ప్రస్తుతం జాన్వీ కపూర్ బాలీవుడ్లో ‘పరమ సుందరి’ మూవీలో నటిస్తున్నది. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా కనిపించనున్నాడు. ఈ మూవీ ఈ ఏడాది జూలైలో విడుదల కానున్నది. తుషార్ జలోటా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.