Janhvi Kapoor | అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా సినీ రంగంలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతోంది. బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూనే, తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ‘పెద్ది’ సినిమాతో సిద్ధమవుతోంది. అయితే తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న జాన్వీ తన జీవితంలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని వెల్లడించి అందరినీ ఆలోచనలో పడేసింది.జాన్వీ కపూర్ మాట్లాడుతూ, తాను కేవలం 15 ఏళ్ల వయసులోనే డీప్‌ఫేక్ టెక్నాలజీ కారణంగా ఒక విచిత్రమైన ఘటనను ఎదుర్కొన్నానని తెలిపింది. “అప్పుడు నేను స్కూల్లో చదువుకుంటున్నాను. ఒక రోజు నా ఫ్రెండ్ ఒక అశ్లీల వెబ్సైట్లో నా ఫోటో ఉందని చెప్పాడు. అది నిజానికి నా ఫోటో కాదు… డీప్‌ఫేక్ ద్వారా తయారు చేసిన ఫోటో” అని ఆమె చెప్పుకొచ్చింది.
ఈ సంఘటన తనపై తీవ్ర ప్రభావం చూపిందని జాన్వీ వెల్లడించింది. “ఆ ఫోటో గురించి తెలిసినప్పుడు నేను చాలా షాక్‌కు గురయ్యాను. ఏమి చేయాలో అర్థం కాలేదు. ఆ సమయంలో నేను చాలా బాధపడ్డాను. అదే సమయంలో సోషల్ మీడియా లో నైతికత ఎంత తక్కువగా ఉందో నాకు అర్థమైంది” అని ఆమె తెలిపింది. అప్పుడే నేను గ్రహించాను… భవిష్యత్తులో కూడా ఇలాంటి విషయాలు ఎదురవుతాయని. అందుకే ఇప్పుడు ఇలాంటి డీప్‌ఫేక్ ఫోటోలు వచ్చినా వాటిని ఎక్కువగా పట్టించుకోను అని జాన్వీ కపూర్ స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలో టెక్నాలజీ దుర్వినియోగం ఎలా వ్యక్తిగత జీవితాలను ప్రభావితం చేస్తుందో ఈ ఘటన మరోసారి చూపిస్తోంది. ముఖ్యంగా డీప్‌ఫేక్ వంటి టెక్నాలజీ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, సెలబ్రిటీలే కాక సాధారణ ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, జాన్వీ కపూర్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు చిత్రం ‘పెద్ది’తో పాటు బాలీవుడ్లో కూడా వరుస ప్రాజెక్టులతో ఆమె కెరీర్ పీక్‌లో కొనసాగుతోంది.