భారతీయ చలనచిత్ర సంగీత గగనాన ఆరు దశాబ్దాల పాటు తన అమోఘ, అద్భుత గాన మాధుర్యంతో అఖండ సామ్రాజ్యాన్ని ఏలిన స్వర సామ్రాజ్ఞి, గానకోకిల శిష్ట్లా శ్రీరామమూర్తి జానకి జీవితం, ఆమె సాధించిన అపురూప విజయాల ప్రస్థానం భారతీయ సంస్కృతిలోనే ఒక సువర్ణాధ్యాయం. పాటను కేవలం శబ్ద తరంగాలుగా కాకుండా, హృదయ స్పందనగా మార్చి కోట్లాది మంది శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన అసమాన ప్రతిభాశాలి ఆమె. శాస్త్రీయ సంగీతంలో పద్ధతి ప్రకారం సాంప్రదాయ శిక్షణ తీసుకోకపోయినప్పటికీ, కేవలం ప్రకృతి ప్రసాదించిన సహజ సిద్ధమైన గాత్ర మాధుర్యం, నిరంతర సాధన, ఏకాగ్రత, పట్టుదలతో ఆమె సాధించిన శిఖర సమాన విజయాలు రాబోవు తరాలకు సైతం ఒక గొప్ప మార్గదర్శకం.
ప్రతి రాగానికి ఆత్మను, ప్రతి పదానికి సజీవ భావాన్ని జోడించి ఆలపించడం ఆమెకు మాత్రమే సాధ్యమైన అరుదైన కళ. అందుకే ఆమెను అభిమానులు, సంగీత విమర్శకులు కేవలం ఒక నేపథ్య గాయనిగా మాత్రమే కాకుండా, దక్షిణ భారత కోకిలగా, గాన సరస్వతిగా, భావగాయనిగా గుండెల్లో పెట్టుకొని పూజిస్తారు. 1938 ఏప్రిల్ 23వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో ఒక సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన జానకి, చిన్ననాటి నుంచే నాద బ్రహ్మ ఉపాసన వైపు ఆకర్షితులయ్యారు. చుట్టూ వినిపించే ప్రతి ధ్వనిని గమనిస్తూ, పక్షుల కూతలను, ప్రకృతి నాదాలను అనుకరిస్తూ సంగీతంపై అసాధారణమైన మక్కువ పెంచుకున్నారు. ఆమెలోని ప్రతిభను గుర్తించిన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆమె మేనమామ డాక్టర్ చంద్రశేఖర్ ఆమెను ఎంతగానో ప్రోత్సహించి చెన్నై చేర్చడంతో భారతీయ సినీ సంగీత చరిత్రలో ఒక సరికొత్త అధ్యయనానికి నాంది పడింది.
మహానగరం చెన్నైలో అడుగుపెట్టిన తర్వాత ఆమె ప్రతిభను గుర్తించిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఏవీఎమ్ స్టూడియోస్ వారు ఆమెకు గొప్ప అవకాశాన్ని కల్పించారు. 1957లో విడుదలైన ’విధియిన్ విలయట్టు’ అనే తమిళ చిత్రం ద్వారా నేపథ్య గాయనిగా చలనచిత్ర రంగానికి పరిచయమైన జానకి, అదే సంవత్సరంలో ’ఎమ్మెల్యే’ చిత్రంలోని ’నీ ఐదో అంతస్తుల మేడ’ అనే అద్భుతమైన గీతంతో తెలుగు శ్రోతలను పలకరించారు. ఆనాటి నుంచి మొదలైన ఆమె విజయయాత్ర ఎక్కడా ఆగకుండా, అలసట లేకుండా సుదీర్ఘ కాలం పాటు కొనసాగింది. కేవలం తెలుగు, తమిళ భాషలకే పరిమితం కాకుండా కన్నడ, మలయాళం, హిందీ, ఒడియా, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, తుళు, కొంకణి, పంజాబీ, సింహళ, సంస్కృతం ఇలా దాదాపు ఇరవైకి పైగా భారతీయ భాషల్లో సుమారు 48 వేలకు పైగా గీతాలను ఆలపించి అత్యధిక పాటలు పాడిన గాయనీమణుల్లో అగ్రగణ్యురాలిగా నిలిచారు. ముఖ్యంగా కన్నడ చిత్రసీమలో ఆమె పాడిన వేలాది పాటలు ఎంతటి ప్రజాదరణ పొందాయంటే, అక్కడి శ్రోతలు ఆమెను తమ సొంత కన్నడ కన్నబిడ్డగానే భావించి ఆరాధిస్తారు.
మలయాళంలోనూ ఆమె ఉచ్చారణ, శబ్ద సౌందర్యం ఎంత స్పష్టంగా ఉండేదంటే, కేరళ ప్రజలు ఆమెను తమ రాష్ర్టానికి చెందిన గాయనిగానే మనస్ఫూర్తిగా స్వీకరించారు. భాష ఏదైనా, భావం ఒక్కటే అని నమ్మిన జానకి, తాను పాడే ప్రతి అక్షరం వెనుక ఉన్న అంతరార్థాన్ని, ఆయా ప్రాంతాల సంస్కృతిని, ఉచ్చారణా పద్ధతులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, ఆ తర్వాతే మైకు ముందుకు వచ్చి ప్రాణం పోసేవారు.
తెలుగు సినీ సంగీత స్వర్ణయుగంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.బి. శ్రీనివాస్ వంటి దిగ్గజాలతో ప్రారంభమైన ఆమె ప్రయాణం, ఆ తర్వాత తరంలో గానగంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఒక అద్భుతమైన నూతన శకాన్ని సృష్టించింది. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకిల స్వర సమ్మేళనంలో వెలువడిన వేలాది యుగళ గీతాలు దక్షిణ భారత చలనచిత్ర రంగాన్ని కొన్ని దశాబ్దాల పాటు శాసించాయి. వీరిద్దరి గొంతుల్లోని కెమిస్ట్రీ, పరస్పర అవగాహన, శృతి లయల అనుసంధానం శ్రోతలకు స్వర్గానందాన్ని కలిగించేవి. శృంగార గీతాలైనా, విరహ గీతాలైనా, సరదా పాటలైనా వీరిద్దరు పోటీ పడి పాడుతుంటే థియేటర్లు మార్మోగిపోయేవి. అలాగే సంగీత దర్శకుల విషయానికి వస్తే, మాస్ట్రో ఇళయరాజాతో ఆమెకు ఉన్న అనుబంధం అపురూపమైనది.
ఇళయరాజా సృష్టించిన సంక్లిష్టమైన, శాస్త్రీయ రాగాల ఆధారిత స్వరకల్పనలను జానకి అత్యంత సునాయాసంగా, తనదైన శైలిలో అలంకరించి అమరత్వాన్ని ప్రసాదించారు. కె.వి. మహదేవన్, చక్రవర్తి, రాజన్-నాగేంద్ర, ఎం.ఎస్. విశ్వనాథన్, రమేష్ నాయుడు, సత్యం, హంసలేఖ నుంచి నేటి తరం దిగ్గజం ఎ.ఆర్. రెహమాన్ వరకు ఎందరో మహానుభావుల దర్శకత్వంలో ఆమె అసమానమైన గీతాలను పాడారు. సంగీత దర్శకుడు ఎవరైనా, వారు అనుకున్న భావాన్ని వంద శాతం తెరపైకి తీసుకురావడంలో జానకి ఎల్లప్పుడూ ప్రథమ స్థానంలో ఉండేవారు.
ఎస్. జానకి గాన శైలిలోని అత్యంత విలక్షణమైన, అపురూపమైన వైశిష్ట్యం ఆమెకు ఉన్న స్వర వైవిధ్యం లేదా గాత్ర అనుకరణ నైపుణ్యం. ఒకే రోజు రికార్డింగ్లో ఉదయం పూట ఎనిమిదేండ్ల్ల చిన్నారి గొంతుతో అత్యంత అమాయకంగా, ముద్దుముద్దుగా పాడగలిగే ఆమె, మధ్యాహ్నానికి ఎనభై ఏండ్ల వృద్ధురాలి గొంతులోని వణుకును, ఆ గంభీరతను అంతే సహజంగా అనుకరించగలిగేవారు. పాత్ర వయస్సు, ఆ పాత్ర ప్రదర్శించే హావభావాలు, సన్నివేశంలోని తీవ్రతను పూర్తిగా ఆకలింపు చేసుకొని తన గాత్రాన్ని దానికి అనుగుణంగా మలచుకోవడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఆమె పాడుతుంటే కేవలం సంగీతం మాత్రమే వినిపించదు, ఆ పాత్ర నటన, ఆ కళ్లలోని భావాలు, మనసులోని ఆవేదన లేదా ఆనందం శ్రోత కండ్ల ముందు సజీవంగా కదలాడుతాయి. ’పదహారేళ్ల వయసు’ చిత్రంలో వయసు రాని పల్లెటూరి పిల్ల అమాయకత్వాన్ని, ’శంకరాభరణం’ చిత్రంలో శాస్త్రీయ సంగీత పునాదులున్న నర్తకి అంతర్మథనాన్ని, ’స్వాతిముత్యం’ చిత్రంలో అమాయకుడైన భర్తను ఆదరించే ఇల్లాలు ఆవేదనను ఆమె తన గాత్రం ద్వారానే అద్భుతంగా ఆవిష్కరించారు. జానపదాల్లోని నాటుదనం, పాశ్చాత్య సంగీతంలోని వేగం, శాస్త్రీయ సంగీతంలోని గంభీరత ఇలా ఏ ప్రక్రియ తీసుకున్నా అందులో జానకి ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది.
ఆమె అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా జాతీయ స్థాయిలో నాలుగు సార్లు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర పురస్కారాలు లభించాయి. 1977లో తమిళ చిత్రం ’16 వయదినిలే’, 1981లో మలయాళ చిత్రం ’ఒప్పోల్’, 1984లో తెలుగు చలనచిత్రం ’సితార’ (వెన్నెల్లో గోదారి అందం పాట), 1992లో మలయాళ చిత్రం ’మళయున్ను మున్పే’ చిత్రాలకు గాను ఆమె ఈ అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు. వీటితో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి దాదాపు 30కు పైగా రాష్ట్ర స్థాయి అవార్డులను సొంతం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక నంది పురస్కారాలను, తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రభుత్వాల నుంచి అనేక పర్యాయాలు ఉత్తమ గాయని అవార్డులను అందుకుని రికార్డు సృష్టించారు. అయితే, 2013వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆమెకు ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని ఆమె అత్యంత మర్యాదపూర్వకంగా, అంతే దృఢంగా తిరస్కరించడం సంచలనం సృష్టించింది. దక్షిణ భారత కళాకారుల ప్రతిభకు కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో తగిన గుర్తింపు ఇవ్వడం లేదని, దశాబ్దాల సేవ తర్వాత అత్యంత ఆలస్యంగా ఇటువంటి పురస్కారాలను ప్రకటించడం సమంజసం కాదని పేర్కొంటూ ఆమె ఆ అవార్డును నిరాకరించారు. ఈ నిర్ణయం ద్వారా ఒక కళాకారిణిగా తనకున్న ఆత్మగౌరవాన్ని, తోటి దక్షిణ భారత కళాకారుల పట్ల తనకున్న సంఘీభావాన్ని చాటిచెప్పి అందరి ప్రశంసలు అందుకున్నారు.
అత్యున్నత శిఖరాలను అధిరోహించినప్పటికీ, వ్యక్తిగత జీవితంలో ఎస్. జానకి ఎంతో సరళంగా, నిరాడంబరంగా ఉండేవారు. ప్రచార ఆర్భాటాలకు, కీర్తి కండూతికి ఆమె ఎల్లప్పుడూ దూరంగా గడిపారు. తెల్లటి కాటన్ చీర, ముఖాన పెద్ద బొట్టు, పెదవులపై సదా నిలిచే మందహాసంతో ఒక సాధారణ గృహిణిలా కనిపించే ఆమె, మైకు ముందుకు వస్తే మాత్రం అసాధారణ శక్తి స్వరూపిణిలా మారిపోయేవారు. తన సంగీత ప్రస్థానంలో ఎందరో కొత్త గాయనీ గాయకులను ప్రోత్సహించి, వారికి అమూల్యమైన సలహాలను అందించారు. 2016 అక్టోబర్లో మైసూర్ వేదికగా జరిగిన ఒక చలనచిత్ర ఉత్సవంలో ఇకపై తాను చలనచిత్ర గీతాలను పాడబోనని, తన సుదీర్ఘ గాన ప్రస్థానానికి విరమణ ప్రకటిస్తున్నానని అధికారికంగా వెల్లడించారు. తాను పాడుతున్నంత కాలం అత్యున్నత స్థాయిలో పాడానని, వయసు పైబడుతున్న తరుణంలో తన స్వర నాణ్యత తగ్గకముందే గౌరవప్రదంగా విరమించుకోవడం మంచిదనే ఉన్నతమైన ఆలోచనతో ఆమె ఆ నిర్ణయం తీసుకున్నారు.
ఎస్. జానకి గొంతు కేవలం ఒక తరం అలసటను తీర్చినది కాదు, అది తరాల సరిహద్దులను దాటి ప్రవహిస్తున్న అమృత స్రవంతి. అమ్మ ఒడిలోని పసిపాపకు జోలపాటగా లాలించినా, ప్రణయ వీధిలోని ప్రేమికులకు అనురాగ గీతంగా అలరించినా, భగవంతుని సన్నిధిలో భక్తి పారవశ్యంతో ముంచెత్తినా అది కేవలం ఆమె స్వరానికే సాధ్యమైంది. చలనచిత్ర రంగానికి ఆమె చేసిన సేవలు, సృష్టించిన రికార్డులు భౌతికంగా కాలగమనంలో నిలిచిపోయేవి కావు, అవి శాశ్వతమైనవి.
రాగయుక్తమైన స్వరాలు ఉన్నంత కా లం, గుండెల్లో భావ వ్యక్తీకరణ బతికున్నంత కాలం, భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఉనికిలో ఉన్నంత కాలం ఎస్. జానకి అనే పేరు, ఆమె మధుర గాత్రం విశ్వమంతటా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఒక అపురూప నక్షత్రంలా సంగీత ప్రపంచాన్ని వెలిగించిన ఆమె కీర్తి యుగయుగాల పాటు అజరామరంగా, చిరస్మరణీయంగా నిలిచిపోతుంది.
-రామకిష్టయ్య సంగనభట్ల (సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్
కాలమిస్ట్.. 9440595494)