Janaki vs State of Kerala | మలయాళ నటులు అనుపమ పరమేశ్వరన్, కేంద్రమంత్రి సురేష్ గోపి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ’ (Janaki vs State of Kerala). ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కాస్మోస్ ఎంటర్టైనమెంట్స్ నిర్మిస్తుండగా.. శృతి రామచంద్రన్, మాధవ్ సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూన్ 27 ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్ అభ్యంతరం వలన సినిమా వాయిదా పడినట్లు తెలుస్తుంది.
ఈ సినిమాలో బాధితురాలి పాత్రకు జానకి అని దైవ సంబంధమైన పేరుని పెట్టడంపై ముంబై సెన్సార్ బోర్డు (CBFC) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చిత్రంలో జానకి అనే పేరుతో ఓ మహిళ అత్యాచార బాధితురాలిగా న్యాయపోరాటం చేస్తుందని, అయితే ‘జానకి’ అనేది సీతాదేవికి మరో పేరు కావడంతో, అలాంటి పేరును అత్యాచార బాధితురాలికి పెట్టకూడదని సెన్సార్ బోర్డు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై దర్శకుడు ప్రవీణ్ నారాయణన్ తన ఫేస్బుక్ పోస్ట్‌లో స్పందిస్తూ, జూన్ 27న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడిందని ధృవీకరించారు.
ఈ నిర్ణయంపై మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ (FEFKA) జనరల్ సెక్రటరీ బి. ఉన్నికృష్ణన్ సెన్సార్ బోర్డు నిర్ణయాన్ని విమర్శించారు. దేవుళ్ల పేర్లు కలిగిన పాత్రలకు ఇటువంటి నిబంధనలు పెట్టడం విడ్డూరంగా ఉందని, ఇది కళాత్మక స్వేచ్ఛను అడ్డుకుంటుందని ఆయన అన్నారు. ఇలాంటి నిబంధనలు ఉంటే, హిందూ మతానికి చెందిన పాత్రలకు పేర్లు ఎంపిక చేసుకోవడం చాలా కష్టమవుతుందని ఆయన ప్రశ్నించారు.
తిరువనంతపురంలోని ప్రాంతీయ సెన్సార్ కార్యాలయం ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేసినప్పటికీ, ముంబైలోని ప్రధాన కార్యాలయం ఈ టైటిల్‌ను మార్చాలని డిమాండ్ చేయడంతో ఈ సమస్య తలెత్తింది. పేరు మార్చాల్సి వస్తే, సినిమాలోని అనేక సంభాషణలను కూడా మార్చాల్సి వస్తుందని మేకర్స్ ఆందోళన చెందుతున్నారు.