Janaki vs State of Kerala Title Contraversy | గత కొన్నిరోజులుగా మలయాళం ఇండస్ట్రీలో నడుస్తున్న ‘జానకి వర్సెస్ కేరళ’ టైటిల్ వివాదం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సూచనల మేరకు నిర్మాతలు ఈ సినిమా టైటిల్‌ను మార్చడానికి అంగీకరించారు. సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాపై సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఈ సినిమా టైటిల్లో జానకి పేరు ఉండడం వలన ఆ పేరును మార్చాలని సెన్సార్ బోర్డు తెలిపింది. ‘జానకి’ అనే పేరు హిందూ దేవత సీత పేరుకు మరో రూపం కావడంతో, లైంగిక దాడికి గురైన మహిళా పాత్రకు ఈ పేరు పెట్టడం మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తుందని CBFC అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే సెన్సార్ ఇచ్చిన రిపోర్ట్‌పై నిర్మాతలు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో నడుస్తుండగా.. ఇంతకాలం అభ్యంతరం చెప్పిన సెన్సార్ బోర్డు ఇప్పుడు వెనక్కి తగ్గింది. ఈ మూవీలో 96 కట్స్ చెప్పనున్నట్లు ముందు ప్రకటించిన బోర్డు ఇప్పుడు మాత్రం కేవళం రెండు మార్పులు చేస్తే సరిపోతుందని తెలిపింది. ఈ సినిమా టైటిల్‌ను
‘జానకి వర్సెస్ కేరళ’ టైటిల్‌కి బదులుగా ‘జానకి V vs స్టేట్ ఆఫ్ కేరళ’ లేదా ‘V జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ’గా మార్చాలని తెలిపింది. హీరోయిన్ పూర్తి పేరు జానకి విద్యాధరన్ కావడంతో, ‘V’ అక్షరాన్ని చేర్చాలని CBFC సూచించింది. అలాగే సినిమాలోని ఓ కోర్టు సన్నివేశంలో జానకి పూర్తి పేరు రెండుసార్లు పలకగా, ఆ భాగాన్ని మ్యూట్ చేయాలని CBFC కోరింది. ఈ సన్నివేశంలో హీరోయిన్ను డ్రగ్స్ వాడకం, పోర్నోగ్రాఫిక్ కంటెంట్ చూడటం వంటి విషయాలపై ప్రశ్నించడం, ఆమెకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నట్లు చెప్పడం వంటివి ఉన్నాయి. ఇవి గౌరవనీయమైన పేరు ఉన్న పాత్రకు తగదని బోర్డు అభిప్రాయపడింది. ఈ మార్పులకు చిత్రబృందం అంగీకరిస్తే.. మూడు రోజుల్లోగా సినిమాకు సర్టిఫికేషన్ ఇస్తామని CBFC హామీ ఇచ్చింది. అయితే, ఈ కేసుపై మరోవైపు న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది.
ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కోర్ట్‌రూమ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కింది. కాస్మోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై జె. ఫణీంద్ర కుమార్ నిర్మించారు. టైటిల్ వివాదం కారణంగా జూన్ 20న విడుదల కావాల్సిన సినిమా ఆలస్యమైంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.