‘సుహాస్ ఒకప్పుడు మీలో ఒకడు. ఇప్పుడు ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగాడు. యంగ్‌స్టర్స్ పనిచేసిన ఈ సినిమా పెద్ద హిట్ కాబోతున్నది. మనసారా నవ్వుకునేలా సినిమా ఉంటుంది.’ అని దిల్‌రాజు అన్నారు. దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై శిరీష్ సమర్పణలో సుహాస్, సంగీర్తన జంటగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. సందీప్‌రెడ్డి బండ్ల దర్శకుడు. హర్షిత్‌రెడ్డి, హన్షితరెడ్డి నిర్మాతలు. ఈ నెల 12న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా మచిలీపట్నంలో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో దిల్‌రాజు మాట్లాడారు. ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. అవకాశం ఇచ్చిన దిల్‌రాజుకూ, హీరో సుహాస్‌కు దర్శకుడు సందీప్‌రెడ్డి బండ్ల కృతజ్ఞతలు తెలిపారు. ‘ఈ సినిమాపై నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్‌గా మారాను. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా. ఇంతమంచి సినిమాలో, అద్భుతమైన పాత్ర ఇచ్చి పోత్సహించిన దర్శక,నిర్మాతలకు థ్యాంక్స్.’ అని సుహాస్ చెప్పారు. ఇంకా కథానాయిక సంగీర్తన కూడా మాట్లాడారు.