Jana Nayagan | దళపతి విజయ్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జన నాయగన్’ పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. విభిన్నమైన కథలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని, కన్నడలో పలు సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించింది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తుండగా, కథలో కీలక పాత్రలో ‘ప్రేమలు’, ‘డ్యూడ్’ ఫేమ్ మమితా బైజు కనిపించనుంది. ప్రచార కార్యక్రమాలతోనే ఇప్పటికే రికార్డులు సృష్టిస్తున్న ‘జన నాయగన్’, ఇటీవల మలేషియాలోని కౌలాలంపూర్‌లో నిర్వహించిన ఆడియో లాంచ్‌తో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. విదేశాల్లో ఆడియో వేడుక నిర్వహించిన తొలి భారతీయ చిత్రంగా నిలిచిన ఈ ఈవెంట్‌కు 90 వేల మందికి పైగా అభిమానులు హాజరుకావడంతో, ఈ చిత్రం మలేసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.
ఇప్పటికే భారీ బిజినెస్ సాధించిన ఈ సినిమా జనవరి 9న తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని ‘జన నాయకుడు’ అనే టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచే ఓ ఆసక్తికరమైన ప్రచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది ఏమిటంటే… ‘జన నాయగన్’ అనేది బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘భగవంత్ కేసరి’ ఆధారంగా తెరకెక్కిందనే వాదన. దీనిపై దర్శకుడు హెచ్. వినోద్, అలాగే ‘భగవంత్ కేసరి’ దర్శకుడు అనిల్ రావిపూడి కూడా గతంలో స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నించారు. వినోద్ “ఇది పూర్తిగా విజయ్ సినిమా” అని చెప్పగా, అనిల్ రావిపూడి “తన కథను ఎంతవరకు ఉపయోగించుకున్నారో సినిమా రిలీజ్ తర్వాతే తెలుస్తుంది” అని వ్యాఖ్యానించడం మరిన్ని అనుమానాలకు దారి తీసింది.
అయితే తాజాగా విడుదల చేసిన ఓ పోస్టర్‌తో మేకర్స్ ఈ రూమర్లకు పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టయ్యింది. ఆ పోస్టర్లో విజయ్ గన్ ఫైర్ చేస్తూ కనిపించగా, అదే గన్ ప్రారంభ భాగంలో బాబీ డియోల్, గన్ ఎడ్జ్ వద్ద బందీగా కూర్చున్న మమితా బైజు కనిపించడం గమనార్హం. ఈ విజువల్స్ చూసిన నెటిజన్లు, ‘భగవంత్ కేసరి’ కీలక సన్నివేశాలను గుర్తు చేస్తోందని కామెంట్లు చేస్తున్నారు. దీంతో ‘జన నాయగన్’ నిజంగానే ‘భగవంత్ కేసరి’ కోర్ పాయింట్ ఆధారంగా తెరకెక్కిందనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. ముందుగానే రీమేక్ అని ప్రకటిస్తే ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోతుందనే ఉద్దేశంతోనే మేకర్స్ ఇప్పటివరకు ఈ విషయాన్ని బయటపెట్టలేదని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జనవరి 3న తెలుగు వెర్షన్ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ట్రైలర్‌తో కథపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశముందని, అప్పటికి రీమేక్ అంశం మరింత ఓపెన్ అవుతుందని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.