Jana Nayagan |తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’ ట్రైలర్ ఎట్టకేలకి విడుదలైంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జనవరి 9న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే రాజకీయాల్లోకి అడుగుపెట్టి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న విజయ్‌కు ఇదే చివరి సినిమా అని ఆయన స్వయంగా గతంలో ప్రకటించడంతో, ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో చర్చ మరింత ఊపందుకుంది. ముఖ్యంగా ట్రైలర్ చూస్తే నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ సినిమాను గుర్తు చేస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారంటూ గతంలోనే అనేక కథనాలు రావడం, ఇప్పుడు ట్రైలర్లో కనిపించిన అంశాలతో ఆ వార్తలు నిజమేనని అభిమానులు భావిస్తున్నారు.
ఇదే విషయంపై ఇటీవల దర్శకుడు అనిల్ రావిపూడిని కొందరు ప్రశ్నించగా, ఆయన ఆసక్తికరంగా స్పందించారు. వాళ్లు కూడా చాలా దాచిపెట్టి చెబుతున్నారని, ఆ మూవీ డైరెక్టర్ కూడా ఇది విజయ్ సినిమా అని చెప్పారని వ్యాఖ్యానించారు. సినిమా విడుదలయ్యే వరకు దీనిని అలాగే ట్రీట్ చేద్దామని, ఇది దళపతి విజయ్ సినిమా అని అనిల్ రావిపూడి స్పష్టం చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘పెద్దాయన ఓ పేరు పంపాను వాడెవడో ఏంటో కనుక్కొని చెప్పు’ అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం కాగా… పంబ రేగ్గొట్టే వాడి పేరు వినుంటావ్. అందులో రికార్డు ఉన్న వాడి పేరు విన్నావా అంటూ దళపతి విజయ్ ఎలివేషన్ ఓ రేంజ్లో ఉంది ట్రైలర్ చూస్తుంటే . ‘భగవంత్ కేసరి’లో కొన్ని సీన్స్ ట్రైలర్లో సింక్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. మమితా బైజు ఫోబియాతో బాధ పడుతుండడం, విజయ్ ఆమెకు ధైర్యం చెప్పి ఆర్మీలో చేర్చాలనుకోవడం సినిమాపై ఆసక్తిని పెంచాయి.
దీంతో పాటే దేశంలో విధ్వంసానికి కొందరు కుట్ర చేయడం… ‘విజ్జీ ప్రాబ్లమ్ తెలుసుకుంటే ఈ దేశానికి రాబోయే ప్రాబ్లం అడ్డుకోవచ్చు’ అంటూ విజయ్ చెప్పే డైలాగ్ సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. అలాగే, ట్రైలర్ క్లైమాక్స్‌లో పొలిటికల్ టచ్‌తో పాటు నేతలను విజయ్ కొరడాతో కొట్టడం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా, కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కనిపించనున్నారు. వీరితో పాటు మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమాకు ఇప్పటికే విడుదలైన పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇటీవల మలేసియాలో ‘జన నాయగన్’ ఆడియో లాంచ్ కార్యక్రమం ఘనంగా జరగడం కూడా సినిమాపై క్రేజ్‌ను మరింత పెంచింది. మొత్తంగా దళపతి విజయ్ కెరీర్‌కు ముగింపు పలికే ఈ సినిమా ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.