Jana Nayagan | కోలీవుడ్‌లో భారీ చర్చకు దారితీసిన జన నాయగన్ సినిమా విడుదల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. గత కొన్ని నెలలుగా సెన్సార్ సమస్యలతో వాయిదా పడుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నారాయణ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “సినిమాను ఎప్పుడో విడుదల చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి ఫైనల్ సర్టిఫికెట్ రాకపోవడంతో రిలీజ్ ఆలస్యమైంది” అని ఆయన తెలిపారు.
నిర్మాత వివరాల ప్రకారం, ‘జన నాయగన్’ చిత్రాన్ని 2025 డిసెంబర్లోనే సెన్సార్ బోర్డుకు పంపించారట. సినిమా చూసిన ఎగ్జామినింగ్ కమిటీ తొలుత U/A 16+ సర్టిఫికెట్ ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ.. అధికారిక ప్రక్రియ పూర్తి చేసే సమయంలో అనూహ్యంగా ప్రాసెస్ నిలిపివేసినట్లు చెప్పారు. ఇక ఆలస్యానికి ప్రధాన కారణం ఓ ఫిర్యాదేనని నిర్మాత వెల్లడించారు. సినిమాకు వ్యతిరేకంగా ఒక కంప్లైంట్ రావడంతో దాన్ని రివైజింగ్ కమిటీకి పంపినట్లు CBFC నుంచి ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందిందని తెలిపారు. రిలీజ్‌కు ముందే ఇలాంటి అభ్యంతరాలు రావడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.
ఈ వ్యవహారంపై మూవీ టీమ్ కోర్టును కూడా ఆశ్రయించినట్లు నారాయణ వెల్లడించారు. సినిమా విడుదలకు ముందే బయటివారి ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోవడం సరైంది కాదని కోర్టులో వాదించినట్లు చెప్పారు. విచారణ సమయంలో తొలుత సినిమాకు ఓకే చెప్పిన కమిటీ సభ్యుడే తర్వాత అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసిందని, దీంతో సెన్సార్ ప్రక్రియ మరింత ఆలస్యమైందని ఆయన వివరించారు. ఇక విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోందని నిర్మాత అన్నారు. టైటిల్స్‌లో ‘దళపతి విజయ్’ అని కాకుండా ‘తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్’ అని వేయాలని అభిమానులు కోరుతున్నారని ఆయన నవ్వుతూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సెన్సార్ పనులు చివరి దశలో ఉన్నాయని, CBFC అధికారులతో చర్చలు కొనసాగుతున్నాయని నిర్మాత స్పష్టం చేశారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో రెండు వారాల్లో సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఈ చిత్రం జనవరి 9న విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడింది.
అయితే ఇదే సమయంలో మూవీ టీమ్‌కు మరో షాక్ తగిలింది. సినిమా ఆన్లైన్లో లీక్ కావడంతో పోలీసులు ఒక ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్‌తో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన తమిళ సినీ పరిశ్రమలో డిజిటల్ పైరసీ సమస్యను మరోసారి హైలైట్ చేసింది. అన్ని అడ్డంకులను దాటుకుని ‘జన నాయగన్’ను వీలైనంత త్వరగా అభిమానుల ముందుకు తీసుకురావడమే తమ లక్ష్యమని నిర్మాత నారాయణ తెలిపారు.