Jana Nayagan | కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన చివరి చిత్రం జననాయగన్ విడుదలకు ముందే పైరసీ బారిన పడటం సినీ పరిశ్రమను కలవరపెడుతోంది. సినిమా కీలక సన్నివేశాలు ఆన్లైన్లో లీక్ కావడంతో చిత్ర యూనిట్ అప్రమత్తమైంది.ఈ ఘటనపై వెంటనే స్పందించిన నిర్మాతలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలతో ఇప్పటికే ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సమాచారం. వారి వద్ద నుంచి కీలక డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకుని, మరింత విచారణ కొనసాగిస్తున్నారు.ఈ నేపథ్యంలో చిత్రబృందం తరఫు న్యాయవాదులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కేవలం సినిమా లీక్ చేసిన వారే కాకుండా, ఆ కంటెంట్‌ను డౌన్లోడ్ చేయడం, షేర్ చేయడం, ఫార్వర్డ్ చేయడం వంటి చర్యలు చేసిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పైరసీని ప్రోత్సహించే ప్రతి ఒక్కరినీ గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘జననాయగన్’ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. రాజకీయాల్లోకి అడుగుపెట్టే ముందు విజయ్ నటిస్తున్న చివరి చిత్రం కావడంతో దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో సినిమా లీక్ కావడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉండగా, సెన్సార్ సర్టిఫికేషన్ ప్రక్రియలో ఆలస్యం కారణంగా విడుదల తేదీపై ఇప్పటికే అనిశ్చితి నెలకొంది. అలాంటి సమయంలో ఈ పైరసీ ఘటన జరగడం చిత్రబృందానికి మరింత ఇబ్బందిగా మారింది.
పైరసీ ఘటనపై సినీ పరిశ్రమలోని ప్రముఖులు కూడా స్పందించారు. చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి దిగ్గజాలు పైరసీని తీవ్రంగా ఖండించారు. కష్టపడి రూపొందించిన సినిమాలను లీక్ చేయడం క్షమించరాని నేరమని, ఇది మొత్తం పరిశ్రమకు ముప్పుగా మారుతుందని పేర్కొన్నారు. ఇక విజయ్ అభిమాన సంఘాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఎక్కడైనా లీక్ అయిన వీడియోలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని, పైరసీని అరికట్టడంలో అందరూ సహకరించాలని పిలుపునిస్తున్నాయి.