SS Rajamouli | ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్, ఇండియన్ ఫిలిం లెజెండ్ ఎస్.ఎస్. రాజమౌళి మళ్ళీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ (Avatar 3) ప్రమోషన్స్‌లో భాగంగా వీరిద్దరి మధ్య ఒక స్పెషల్ ఇంటర్వ్యూ జరుగగా.. దీనికి సంబంధించిన వీడియోను చిత్రబృందం యూట్యూబ్ వేదికగా విడుదల చేసింది. గతంలో ‘RRR’ సమయంలో వీరిద్దరూ కలిసినప్పుడు ఆ ఫోటోలు ఎంత వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అధికారికంగా ఒక ఇంటర్వ్యూలో వీరు పాల్గొనడం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.
ఈ ఇంటర్వ్యూలో రాజమౌళి జేమ్స్ కామెరూన్‌ను అవతార్ 3 గురించి ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు. ముఖ్యంగా ‘అవతార్ 3’లో పండోరా గ్రహంపై కనిపించబోయే కొత్త లోకం గురించి రాజమౌళి అడిగిన ప్రశ్నలకు కామెరూన్ వివరణాత్మక సమాధానాలు ఇచ్చారు. ఈ మూడవ భాగంలో ‘నిప్పు’ (Fire) ‘బూడిద’ (Ash) నేపథ్యంతో ఉండే కొత్త తెగలను, అక్కడి విజువల్ గ్రాండియర్‌ను ఎలా రూపొందించారో కామెరూన్ జక్కన్నకు వివరించారు. అయితే ఈ ఇంటర్వ్యూలో కేవలం ‘అవతార్’ గురించే కాకుండా రాజమౌళి భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి కూడా చర్చ జరిగింది. ముఖ్యంగా రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న ‘వారణాసి’ (Varanasi) ప్రాజెక్ట్ గురించి తనకు తెలుసని, ఆ సినిమా కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు జేమ్స్ కామెరూన్ పేర్కొన్నారు. అలాగే ఈ సినిమా షూటింగ్ జరిగినప్పుడు తాను చూడాలి అనుకుంటున్నట్లు జేమ్స్ తెలిపాడు. కాగా ఈ దిగ్గజ దర్శకుల కలయికకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.