ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం, విష్ణు ఓఐ, రాగ్ మయూర్, ప్రసాద్ బెహారా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మిత్రమండలి’. విజయేందర్ ఎస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ‘జంబర్ గింబర్ లాలా..’ అంటూ సాగే మూడో గీతాన్ని ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తమ జీవితం ఎలా ఉన్నా అందరినీ నవ్వించాలనే లక్ష్యంతో కమెడియన్స్ పనిచేస్తుంటారని, కామెడీ బతికితే అందరూ ఆనందంగా ఉంటారని అన్నారు.
తాను బ్రహ్మానందానికి ఏకలవ్య శిష్యుడినని, ఈ సినిమాలో ఆయనతో కలిసి నటించడంతో కల నిజమైందని ప్రియదర్శి తెలిపారు. ప్రేక్షకుల ముఖాలపై నవ్వులు పూయించడానికే ఈ సినిమా తీశామని బన్నీ వాసు అన్నారు. బ్రహ్మానందంగారి ‘జంబర్ గింబర్ లాలా’ అనే పాపులర్ డైలాగ్తో ఈ పాట చేసి ఆయన పట్ల అభిమానాన్ని చాటుకున్నామని సంగీత దర్శకుడు ఆర్.ఆర్.ధృవన్ పేర్కొన్నారు.