Jailer 2 |సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘జైలర్ 2’ సినిమాపై తాజాగా ఆసక్తికర సమాచారం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. భారీ విజయాన్ని అందుకున్న ‘జైలర్’ చిత్రానికి కొనసాగింపుగా రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం. ‘టైగర్ కా హుకుం’ అంటూ ముత్తువేల్ పాండియన్ పాత్రలో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రజనీకాంత్ సిద్ధమవుతున్నారని టాక్ వినిపిస్తోంది. మొదటి భాగంలో ఆయన శైలి, పోరాట సన్నివేశాలు, సంభాషణలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈసారి ఆ పాత్రను మరింత శక్తివంతంగా చూపించనున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రానికి మరోసారి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందని, ప్రస్తుతం నిర్మాణానంతర పనులు వేగంగా జరుగుతున్నాయని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 10 లేదా 11 తేదీల్లో సినిమాను విడుదల చేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు సమాచారం. పండుగ సెలవులు ఉండటంతో దేశవ్యాప్తంగా మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, ఎస్. జే. సూర్య, రమ్యకృష్ణన్, యోగి బాబు, మీర్నా మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. మొదటి భాగంలాగే ఈసారి కూడా తారాగణం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఇక సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు. తొలి భాగంలో ఆయన నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ఈసారి కూడా ఆయన సంగీతంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే విడుదల తేదీపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే చిత్రబృందం నుంచి స్పష్టత వచ్చే అవకాశముంది. మొత్తానికి రజనీకాంత్ శైలి, నెల్సన్ దర్శకత్వం, భారీ తారాగణంతో ‘జైలర్ 2’పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.