Jailer 2 | వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న సమయంలో జైలర్ చిత్రం రజనీకాంత్‌కి కాస్త ఉపశమనం అందించింది. ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేర్ చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌గా జైలర్ 2 రూపొందుతుంది. దర్శకుడు నెల్సన్ అభిమానుల అంచనాలను దృష్టిలో ఉంచుకొని మరింత ఆసక్తికరంగా రూపొందిస్తున్నారు. రజనీకాంత్ ఇందులో పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తుండగా, ఆయనతో తలపడే విలన్‌గా నాగార్జున నటించబోతున్నట్టు పలు వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే ‘కూలీ’ చిత్రంలో వీరిద్దరూ పోటాపోటీగా ఉండే పాత్రలను పోషిస్తున్నారు.
జైలర్2 లో విలన్ పాత్ర కోసం కొన్ని పేర్లు పరిశీలించినా, నెల్సన్ దృష్టి నాగార్జునపైనే ఉంది. కూలీ చిత్రంలో సైమన్‌గా నాగార్జున అదరగొట్టడంతో జైలర్ 2లో నాగార్జుననే విలన్‌గా నటిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాడట. అందుకే ఇటీవల నాగార్జునను కలవడం, కథ, పాత్ర చెప్పడం జరిగిందట. అది నాగార్జునకి కూడా నచ్చడంతో ఆయన సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలుస్తోంది. ‘జైలర్ 2’ చిత్రానికి సంబంధించి ఇప్పటికి రెండు షెడ్యూల్స్ పూర్తవగా… మూడో షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లోనే రజనీకాంత్ , నాగార్జున భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించనున్నట్టు సమాచారం.
మరోవైపు జైలర్ 2లో నందమూరి బాలకృష్ణ కూడా కీలక పాత్ర పోషించనున్నాడట. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఆయన కనిపించనున్నారని అంటున్నారు. జైలర్లోనే శివరాజ్ కుమార్ పాత్రలో బాలయ్య నటించాల్సి ఉన్నప్పటికీ అది మిస్ కాగా, ఈ సారి మాత్రం బాలకృష్ణని ప్రత్యేక పవర్ ఫుల్ పాత్రలో చూపించబోతున్నాడట నెల్సన్. ఈ వార్తలు నిజమైతే మాత్రం జైలర్ 2 ప్రభంజనం సృష్టించడం ఖాయం. టాలీవుడ్ అగ్రతారలుగా ఉన్న బాలకృష్ణ, నాగార్జునలు ఇంతవరకూ ఒక్క సినిమాలో కూడా కలసి నటించింది లేదు. మరి ఈ సినిమాలో ఇద్దరు కలిసి కనిపిస్తారా, విడివిడిగా సన్నివేశాలు ఉంటాయా అనేది తెలియాల్సి ఉంది.