Jai Hanuman Movie | ఈ ఏడాది హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ప్రశాంత్‌వర్మ (Prashanth Varma). తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించడమే కాకుండా వరల్డ్‌వైడ్‌గా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇదిలావుంటే ఈ సినిమాకు సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. ‘జై హనుమాన్’ అంటూ ఈ సినిమా రానుండగా.. ఇప్పటికే ప్రీ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటుంది ఈ చిత్రం.
అయితే ఈ సినిమాలో హనుమంతుడిగా కనిపించబోయేది ఎవరంటూ అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో మొదట హనుమంతుడిగా టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కనిపించబోతున్నట్లు.. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో కనిపించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యులో పాల్గొన్న హనుమాన్ నిర్మాత చైతన్యరెడ్డి హనుమాన్ పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె.నిరంజన్‌రెడ్డితో కలిసి ఆమె నిర్మించిన చిత్రం ‘డార్లింగ్’. అశ్విన్‌రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చైతన్యరెడ్డి విలేకరులతో ముచ్చటించారు. డార్లింగ్ మూవీతో పాటు హనుమాన్ సినిమాపై రిపోర్టర్లు ప్రశ్నలు అడుగగా.. ఆమె సమాధానమిస్తూ..
జై హనుమాన్ సినిమాలో హనుమంతుడి పాత్ర ఎవరు నటిస్తారనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మా జర్నీని మొదలుపెట్టించింది హనుమానే, ఆయన వల్లే ముందుకు వెళ్తున్నామని చైతన్యరెడ్డి అన్నారు. ఆయన తన పాత్రలో ఏ హీరోని చూడాలనుకుంటే ఆ హీరోతోనే సినిమా జరుగుతుంది అయితే నా పర్సనల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం రామ్ చరణ్ కి ఉంటుంది లేదా ఆయన తండ్రి చిరంజీవి నటించిన బాగుంటుందని ఆమె అన్నారు. ఇప్పుడే ‘జై హనుమాన్’ ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యింది. ‘హను-మాన్’ని మించేలా ఈ సినిమా ఉంటుంది. ఇందులో హనుమంతుడి పాత్ర ఎవరు చేస్తారనేది ఆ హనుమంతుడే డిసైడ్ చేస్తారు’ అని చైతన్యరెడ్డి చెప్పారు.