జగపతిబాబు, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అనంత’. సురేష్‌కృష్ణ దర్శకుడు. ఇన్నర్వ్యూ పతాకంపై గిరీష్ కృష్ణమూర్తి నిర్మిస్తున్నారు. గురువారం టీజర్‌తో పాటు ఆడియోను ఆవిష్కరించారు. దర్శకుడు సురేష్‌కృష్ణ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘పుట్టపర్తి సాయిబాబా మహిమల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. బాబా ప్రేమతత్వాన్ని మరింత మందికి చేరువచేయాలనే ప్రయత్నమిది. ఇందులో ఆధ్యాత్మిక అంశాలతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. కాశీ, చెన్నై, హైదరాబాద్, పుట్టపర్తి వంటి లొకేషన్లలో చిత్రీకరణ జరిపాం’ అన్నారు.
సాయిబాబా తనను నమ్మినవారందరిని ప్రేమించడంతో పాటు విద్య, వైద్యం వంటి సదుపాయాలతో సామాజిక సేవ చేశారని, ఈ సినిమాను అందరూ ఆదరించాలని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ఈ సినిమా ద్వారా బాబా సందేశం ప్రజలందరికి చేరువవుతుందని, ఇంత గొప్ప సినిమాలో పాట రాసే అదృష్టం దక్కిందని రామజోగయ్యశాస్త్రి అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వీరశంకర్, రచయిత సాయిమాధవ్ బుర్రా, సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు తదితరులు పాల్గొన్నారు.