Sequel | చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి మే 9, 1990న విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం అప్పుడు ఇప్పుడు ప్రేక్షకులని అలరిస్తూనే ఉంటుంది. కల్ట్ క్లాసిక్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి టూరిస్ట్ గైడ్‌గా, లెజెండరీ శ్రీదేవి ఇంద్రజ పాత్రను పోషించారు. అమ్రిష్ పూరి, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రామి రెడ్డి, బేబీ షాలిని, బేబీ షామిలీ వంటి వారు కీలక పాత్రలలో నటించి మెప్పించారు. నిర్మాత సి. అశ్విని దత్ తన ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
తెలుగు సినిమా చరిత్రలోనే జగదేకవీరుడు అతిలోకసుందరి ఓ తుఫాన్ అనే చెప్పాలి. రేపటితో ఈ చిత్రం విడుదలై 30 యేళ్లు అవుతుంది. ప్రస్తుతం మూవీకి సంబంధించి జోరుగా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. అయితే అందరిలో ఓ చిన్న డౌట్ మిగిలిపోయింది. ఉంగరం ఏమైంది? ఉంగరం మింగిన చేప ఏమైంది? అని తాజాగా రామ్ చరణ్ కూడా ఇదే ప్రశ్న అడిగారు. అంటే సీక్వెల్ ఉంటే అందులో దీని గురించి ఏమైన వివరణ ఇస్తారేమో అని అందరు అనుకున్నారు. రీరిలీజ్ సందర్భంగా రాఘవేంద్ర రావు, చిరంజీవి, అశ్వినీదత్ కలిసి ఓ ఇంటర్వ్యూ చేసి దాన్ని రిలీజ్ చేయగా ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతోంది.
అందులో రాఘవేంద్రరరావు సీక్వెల్‌పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవిని మరొకరితో రీప్లేస్ చేయడం అసాధ్యమని, ఇళయరాజా సాంగ్స్ ను మళ్లీ ఆ రేంజ్లో రీక్రియేట్ చేయలేమని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. దాంతో జగదేకవీరుడు సీక్వెల్ ప్లాన్ మానుకోవడం బెటర్ అని తెలుస్తుంది. చిత్రానికి ‘మాస్ట్రో’ ఇళయరాజా అయితే ఎవర్ గ్రీన్ సంగీతాన్ని, పాటల్ని అందించారు. ఈ చిత్రంలోని పాటలు నేటికీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. ఈ మూవీకి కథను యండమూరి వీరేంద్రనాథ్.. స్క్రీన్‌ప్లేను జంధ్యాల అందించారు. మే 9 నుంచి 2D, 3D ఫార్మాట్లలో ఈ చిత్రం ప్రేక్షకులని పలకరించనుంది.