Jagadeka Veerudu Athiloka Sundari | మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి ప్రధాన పాత్రలలో కె.రాఘవేంద్ర రావు రూపొందించిన ఫాంటసీ చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ చిత్రం మే 9,1990న విడుదలై ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది ఈ సినిమా 35వ వార్షికోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో రేపు మూవీని 2D అండ్ 3D ఫార్మాట్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. అప్పట్లో ఈ చిత్రం రిలీజ్ చేయడానికి ఎన్నో సమస్యలు వచ్చాయి. మూవీ షూటింగ్ సమయంలో కూడా చిరంజీవి కష్టాలు పడ్డారు. ఎట్టకేలకి మూవీని థియేటర్స్‌లో విడుదల చేసి పెద్ద హిట్ సాధించారు.
ఈ సోషియో-ఫాంటసీ డ్రామాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ నిర్మించారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌కి ఈ చిత్రం ఇప్పటికి ఒక గేమ్‌చేంజర్‌గా ఆయన ఇప్పటికీ భావిస్తుంటారు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి జోడిగా శ్రీదేవి నటించి ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. అమ్రిష్ పురి, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రామిరెడ్డి, బేబీ శాలిని, బేబీ షామిలి వంటి ఆర్టిస్టులు కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ క్లాసిక్ చిత్రాన్ని లేటెస్ట్ ప్రింట్ తో నేటితరం ప్రేక్షకుల ముందు తీసుకువచ్చేందుకు చిత్ర బృందం చాలా కష్టపడింది. మూడు సంవత్సరాల పాటు నెగెటివ్ కోసం ఎన్నో చోట్ల, ఎంత వెతికినా దొరకలేదు. చివరికి దొరికిన కాపీ కూడా చాలా దెబ్బతినడంతో దానిని ప్రసాద్ కార్పొరేషన్ సహకారంతో చిత్రబృందం అవిశ్రాంతంగా శ్రమించి ప్రైమ్ ఫోకస్ సాయంతో 3D రూపానికి తీసుకురావడంలో విజయవంతమయ్యారు.
మూవీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో వైజయంతీ మూవీస్ సంస్థ కొత్త సినిమా రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తోంది. ఈ క్రమంలో చిరంజీవి, రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినీ దత్ లతో యాంకర్ సుమ ఓ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఇందుకు సంబంధించిన ప్రోమో రీసెంట్గా విడుదలైంది.ఇందులో చిరు, సుమ, రాఘవేంద్రరావు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా, చివరలో రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చి ”మాకు తెలుసుకోవాలని ఉంది? ఆ రింగ్ ఏమైంది? ఆ చేప ఏమైంది? 35 సంవత్సరాలు అయింది. దీనికి జవాబు ఆ ఒక్కరే ఇవ్వగలుగుతారు” అని అంటారు. ఈ ప్రోమో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఫుల్ వీడియో మరి కొద్ది నిమిషాలలో రానుంది. దాంతో అన్నింటికి క్లారిటీ వస్తుంది.