Balagam | ఒక మనిషి బతికి ఉన్నప్పుడున్న సంబంధాలు.. ఆ మనిషి చనిపోయినా బతికే ఉంటాయా? ఆ తండ్రికి పుట్టిన, ఆ బంగారు చేతుల్లో పెరిగి పెద్దయిన పిల్లలు.. తోబుట్టినోళ్లు.. పుట్టింటి ఆడబిడ్డలు కలుస్తారా? మనసారా.. ఆ పోయిన మనిషిని తలుస్తారా? ఊరి మర్యాద కోసమైనా ఆ పెద్ద మనిషి గౌరవం కోసం కనీసం పది రోజులైనా నిలుస్తారా? అంటూ ‘బలగం’ సినిమా.. సమాజానికి వేస్తున్న ప్రశ్నలివి!
చావు గురించే ఈ సినిమా.. కానీ, బంధాలు బాగుండాలనే తపన ఉంది! మనల్ని కలల్లోంచి లాగేసి, కళ్లముందు జరిగే కఠినమైన వాస్తవాలను చూపిస్తుంది. ఇలా జరుగుతున్నదని తెలిసినా, ఇలా జరక్కూడదే!’ అని కండ్లల్ల నీళ్లు తిరుగుతాయి. ఈ సినిమాలోని సన్నివేశాల్లో కనిపించే బాధలు, కష్టాలు, కన్నీళ్లు, నవ్వులు, ఏడుపులు పాత్రలతోపాటు మనమూ అనుభవిస్తాం. ఇలా రాశాను గానీ, ఇది ఏడుపు సినిమా కాదు. ఏడుపు ఆపుకోలేని సందర్భాల్లో కూడా నలుగురూ కలిసి నవ్వుతూ నడవాలని చెప్పిన సినిమా. భారీ సెట్టింగులు, భారమైన డైలాగులు, భయంకరమైన సీన్లు.. ఏవీలేని ఈ ‘సింపుల్ సినిమా’ చూస్తున్నంత సేపూ.. ఓ టెంపుల్లో కూర్చున్న ఫీలింగ్ కలిగిస్తుంది.
‘ఓహ్! అప్పుడే అయిపోయిందా!?’ అని అనిపించిందంటే.. ఎక్కడా బోరు కొట్టనట్టు. మనల్ని మనకు చూపించినట్లు. ‘మాయలు తొలగించుకో.. మమతలు పెంచుకో’ అని చెప్పినట్టు! పిట్టంత దర్శకుడు.. ఈ పిట్ట ముట్టిన మంచి సినిమాను ఘనంగా తీశాడు. ఎవరీ దర్శకుడు? వెల్దండి వేణు.. ఒక మామూలు స్ట్రగ్లింగ్ కమెడియన్. చార్లీ చాప్లిన్ నవ్వు వెనక అగాథమైన వేదాంతం ఉన్నట్టు.. వేణు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలోనూ వేదన ఉంది. వేదాంతం ఉంది. ‘అరె, మనం మారాల్రా నాయనా!’ అని చెప్పే దమ్మూ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే..
‘జీవితం’ ఉంది. ఈ సినిమా నిర్మాణ సారథి నరసింహారెడ్డి.. మంచి అభిరుచి కలిగిన వ్యక్తి. సమర్పకుడు దిల్రాజు. దిల్ ఉందని నిరూపించుకున్న సుప్రసిద్ధ నిర్మాత. తండ్రీ బిడ్డల బంధం, అన్నదమ్ముల అనుబంధం, అక్కాచెల్లెళ్లు – అన్నా వదినల ఆప్యాయతలు, మేనల్లుళ్లు, మేనకోడళ్లు, బావా మరదళ్లు.. అందరూ ఈ సినిమాలో కొలువుదీరి ఉంటారు. నవ్విస్తారు. ఏడిపిస్తారు. మనలాగానే ఆశపడతారు. అసూయపడతారు. అహంకారాలు చూపిస్తారు. మరి ఆఖరికి? ఏం చేస్తారో.. సినిమాలోనే చూడండి.
బలగం సినిమాను చూడటం అంటే.. మంచి సినిమాను బతికించుకోవడం. మరిన్ని మంచి సినిమాలకు అవకాశం ఇవ్వడం! దర్శకనిర్మాతలకు ధైర్యాన్ని ఇవ్వడం! అవార్డులు ఎట్లాగూ వస్తాయి. రివార్డులు మనం ఇవ్వాలి. ‘వేణూ! ధైర్యంగా ఇలాంటి సినిమాలు అందించు!’ అని చెప్పాలి. ‘దిల్రాజు గారూ! అప్పుడప్పుడైనా నిజాల్ని చూపించే నిజమైన సినిమాలు మాకు ఇవ్వండి’ అని చెప్పాలి. తెలంగాణ పల్లెసీమల ప్రేమలను చూపిన బలగం..తెలుగు రాష్ర్టాల ఆదరణ చూరగొంటుందని నా బలమైన నమ్మకం.
ఈ సినిమా నిర్మాణంతో నాకు ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు లేవు. ఉన్నదల్లా.. ఒక మంచి సినిమాకు – మంచి సినిమాను పిచ్చిగా ఇష్టపడే ప్రేక్షకుడికి ఉన్న సంబంధమే!
…? అల్లాణి శ్రీధర్