త్రినాథ్ కఠారి హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘ఇట్లు మీ ఎదవ’. ‘వెయ్యేళ్లు ధర్మంగా వర్ధిల్లు’ అనేది ఉపశీర్షిక. సాహితీ అవాంచ కథానాయిక. బళ్లారి శంకర్ నిర్మాత. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానున్నది. ప్రచారంలో భాగంగా ఈ సినిమా నుంచి ఓ గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు. ‘ఉన్నట్టా మరి లేనట్టా..’ అంటూ సాగే ఈ పాటను పూర్ణాచారి రాయగా, ఆర్పీ పట్నాయక్ స్వరపరిచారు. ఎస్పీ చరణ్, శృతిక సముద్రాల ఆలపించారు. త్రినాథ్, సాహితీల జోడి ఈ పాటలో అద్భుతంగా ఉంటుందని, ఆర్పీ పట్నాయక్ సంగీతం సినిమాకు ప్రధాన బలమని మేకర్స్ తెలిపారు. తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవిప్రసాద్, సురభి ప్రభావతి, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జగదీశ్ చీకటి, నిర్మాణం: సంజీవని ప్రొడక్షన్స్.