హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్ దిల్ రాజు (Dil Raju) నివాసంలో మరోసారి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి దిల్ రాజుతోపాటు ఆయన కుమార్తె ఇంట్లో తనిఖీలు ముగిశాయి. అయితే ఆయన సోదరుడు శిరీష్ నివాసంలో సోదాల అనంతరం.. అధికారులు మరోసారి దిల్ రాజు ఇంటికి చేరుకున్నారు. మహిళా అధికారి నేతృత్వంలో ఆయన ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. సంక్రాంతికి సినిమా వసూళ్ల విషయం ఆరాతీస్తున్నట్లు తెలుస్తున్నది.
కాగా, దిల్ రాజు నివాసంలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు సోదాలు జరిగాయి. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలించారు. గురువారం జరిగిన సోదాల్లో దిల్ రాజు నివాసంలో 21 మంది అధికారులు పాల్గొన్నారు.