IT department notice to Prithviraj Sukumaran | ‘ఎల్2 ఎంపురాన్’ సినిమాపై వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించట్లేదు. ఎప్పుడయితే ఈ సినిమా బీజేపీ హిందుత్వ రాజకీయలకు వ్యతిరేకంగా ఉందని టాక్ వచ్చిందో అప్పటినుంచే ఈ సినిమాను టార్గెట్ చేస్తూ వస్తుంది. ఇప్పటికే మూవీ నుంచి సన్నివేశాలను బలవంతంగా తీసివేయించడంతో పాటు మోహన్‌లాల్‌తో క్షమాపణలు చెప్పించుకున్న కేంద్రం శుక్రవారం నాడు చిత్ర నిర్మాతల్లో ఒకరైన గోకులం గోపాలన్‌పై ఈడీని ప్రయోగించింది. కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, శ్రీ గోకులం చిట్స్ అండ్ ఫైనాన్స్ సంస్థ అధినేత గోకులం గోపాలన్ కార్యాలయల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి)శుక్రవారం ఉదయం సోదాలు చేపట్టింది. శ్రీ గోకులం చిట్స్ అండ్ ఫైనాన్స్ సంస్థ విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఈ దాడులు జరిపినట్లు తెలుస్తుంది. అయితే ఈ వివాదం సద్దుమణగకముందే మరో వివాదం బయటకు వచ్చింది.
ఎల్ 2 ఎంపురాన్ దర్శకుడు నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌కి ఐటీ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు అందాయి. 2022లో పృథ్వీరాజ్ నటించిన మూడు చిత్రాలైన ‘జన గణ మన’, ‘గోల్డ్’, ‘కడువ’ సినిమాలకు సంబంధించి ఈ సినిమాలకు వచ్చిన ఆదాయంపై వివరణ ఇవ్వాలని కోరుతూ నోటీసులు అందినట్లు తెలుస్తుంది. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద ఈ మూడు సినిమాలను నిర్మించగా.. ఈ మూడు చిత్రాలకు పృథ్వీరాజ్ సుకుమారన్ పారితోషికం తీసుకోలేదు. అయితే ఈ మూడు సినిమాల వలన రూ.40 కోట్లు లాభం వచ్చినట్లుగా పృథ్వీరాజ్‌పై ఆరోపణలు ఉన్నాయని.. వీటికి సంబంధించి వివరణ ఇవ్వాలని కోరుతూ నోటీసులలో పేర్కొంది. ఈ నోటీసులకు సంబంధించి ఏప్రిల్ 29 వరకు పృథ్వీరాజ్ సమాధానమివ్వాలని ఐటీ శాఖ ఆదేశించినట్లు సమాచారం.
ఐటీ శాఖ నోటీసులపై పృథ్వీరాజ్ తల్లి నటి మల్లిక సుకుమారన్ మాట్లాడుతూ.. తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని, విచారణకు భయపడాల్సిన అవసరం లేదని మీడియాతో అన్నారు. ఈ విషయంలో ఆయన తగిన సమాధానం ఇస్తారని ఆమె తెలిపారు. మరోవైపు కేంద్రం కావాలనే టార్గెట్ చేసి ఎంపురాన్ చిత్రబృందంపై దాడులు చేస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఎంపురాన్ వివాదం ఎంటంటే
మోహన్‌లాల్ (Mohanlal) హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మార్చి 27న విడుదలైంది. అయితే ఈ మూవీలో 2002లో గుజరాత్లో చోటుచేసుకున్న గోద్రా అల్లర్లు సంబంధించి సన్నివేశాలు ఉన్నాయి. ఈ మూవీలో బాల్‌రాజ్ భజరంగీ అనే వ్యక్తి ముస్లింలను కిరాతకంగా చంపడం చూపించారు. దీంతో ఈ చిత్రం హిందూ వ్యతిరేక అజెండాను ప్రోత్సహిస్తోందని బీజేపీ సభ్యులు ఆరోపించారు. దీంతో సెన్సార్ సభ్యులు ఈ మూవీని రీ సెన్సార్ చేసి 51 కట్స్ చెప్పారు.
గోద్రా అల్లర్లు
2002 ఫిబ్రవరి 27న గుజరాత్‌లోని గోద్రా రైల్వే స్టేషన్ సమీపంలోని సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగిన ఈ ఘటనలో 59 మంది హిందూ యాత్రికులు మరణించారు. దీంతో ఈ వివాదం ముదిరి హిందు – ముస్లింల మధ్య అల్లర్లు చేలరేగాయి. ఈ అల్లర్లలో “బాబు బజరంగీ” అనే వ్యక్తి పేరు ప్రముఖంగా వినిపించింది. ఇతడు బజరంగ్ దళ్ అనే హిందూ సంస్థలో సభ్యుడు. తన బృందాన్ని రెచ్చగొట్టి ముస్లింలపై దాడులు చేయడంతో పాటు గర్భవతిగా ఉన్న ఒక ముస్లిం మహిళపై తన బృందం రేప్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కోన్నారు. ఈ ఘటనలో దాదాపు 97 మందికి పైగా ముస్లింలు మరణించారు.
ఒక మీడియా చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో తానే ఈ అల్లర్లకు పాల్పడినట్లు బాబు బజరంగీ చెప్పడంతో అతడికి కోర్టు జీవితకాల జైలు శిక్షను విధించింది. అయితే ఈ అల్లర్ల విషయంలో తనకు నరేంద్ర మోదీ (అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి) అలాగే ఇతర ప్రముఖ నాయకుల సహకారం ఉందని బాబు బజరంగీ పలు సందర్భాల్లో పేర్కొన్నాడు.