Lenin | అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని చాలా కాలంగా ఎదురుచూస్తున్న కమర్షియల్ బ్రేక్‌ను ‘లెనిన్’ రూపంలో అందుకున్నారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా విడుదలైన తొలి షో నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుని బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. కెరీర్లో పదేళ్లుగా భారీ విజయానికి ఎదురుచూస్తున్న అఖిల్‌కు ఈ సినిమా కీలక మలుపుగా నిలిచింది. మిక్స్డ్ రివ్యూలు వచ్చినప్పటికీ, పాజిటివ్ మౌత్ టాక్ కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు భారీగా తరలివస్తున్నారు. ‘లెనిన్’ విడుదలైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.16.7 కోట్ల గ్రాస్ వసూలు చేసి అఖిల్ కెరీర్లోనే అత్యుత్తమ ఓపెనింగ్స్‌ను నమోదు చేసింది. రెండో రోజు కూడా అదే జోరు కొనసాగిస్తూ రెండు రోజుల్లో రూ.37.2 కోట్ల గ్రాస్‌ను దాటింది. ఆదివారం సెలవు రోజున ఆక్యుపెన్సీ మరింత పెరగడంతో సినిమా వసూళ్లు భారీగా నమోదయ్యాయి.
దీంతో కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.61.1 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారిక పోస్టర్ విడుదల చేసింది. ప్రేక్షకుల ప్రేమతో ఫస్ట్ వీకెండ్ అద్భుతంగా ముగిసింది అంటూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే సినిమా విజయోత్సాహం కొనసాగుతున్న సమయంలో విడుదల చేసిన ఈ కలెక్షన్ల పోస్టర్ సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారితీసింది. కొందరు నెటిజన్లు, ట్రేడ్ వర్గాలకు చెందిన వారు ప్రకటించిన వసూళ్లపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవ కలెక్షన్ల కంటే ఎక్కువగా చూపించారని, ప్రచారంలో భాగంగానే ఈ సంఖ్యలను ప్రకటించారని ఆరోపణలు చేస్తున్నారు.
ఇదే సమయంలో మరో అంశం కూడా వైరల్‌గా మారింది. ఈ పోస్టర్లో పేర్కొన్న రూ.61.1 కోట్ల సంఖ్య గతంలో విడుదలైన మరో చిత్ర పోస్టర్లోనూ ఉండటం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ‘అనగనగా ఒక రాజు’ చిత్రానికి కూడా మూడు రోజుల్లో రూ.61.1 కోట్ల గ్రాస్ వచ్చినట్లు అప్పట్లో పోస్టర్ విడుదల చేశారు. ఆ చిత్రాన్ని కూడా ఇదే నిర్మాణ సంస్థ నిర్మించింది. ఇప్పుడు ‘లెనిన్’కు కూడా అదే సంఖ్యతో పోస్టర్ విడుదల కావడంతో సోషల్ మీడియాలో పోలికలు మొదలయ్యాయి. ఒకే నిర్మాత నిర్మించిన రెండు వేర్వేరు సినిమాలకు మూడు రోజుల కలెక్షన్లు ఒకేలా ఎలా ఉంటాయి? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కొందరు దీనిని యాదృచ్ఛికంగా భావిస్తుండగా, మరికొందరు ప్రచార వ్యూహంలో భాగమేనని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ‘లెనిన్’ క్లైమాక్స్ సన్నివేశం సీనియర్ హీరో బాలకృష్ణ నటించిన ‘కృష్ణబాబు’ చిత్రంలోని ఓ కీలక సన్నివేశాన్ని పోలి ఉందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఇప్పుడు కలెక్షన్ల పోస్టర్ వివాదం కూడా జతకావడంతో సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది.