క్షుద్ర రాజకీయాలు, డైవర్షన్ డ్రామాలతో అసెంబ్లీ సమావేశాలను దారిమళ్లించేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ సర్కార్ ఆయువుపట్టుపై కొట్టింది బీఆర్ఎస్. సీఎం రేవంత్ సోదరుడి కంపెనీ టెస్సెరాక్ట్కు ప్రభుత్వం కేటాయించిన రూ.200 కోట్ల విలువైన భూమిని కేటీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ బృందం గురువారం పరిశీలించింది. ఫార్మా భూముల్లో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ డొల్లతనాన్ని బద్దలు కొట్టింది. మిథ్యానగరిలో పెట్టుబడులు పెట్టి మున్ముందు మోసపోవద్దని హెచ్చరించింది.
రంగారెడ్డి, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : ఫ్యూచర్‌సిటీ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.కోట్లు విలువజేసే భూములను వారి సోదరులకు అప్పనంగా పంచిపెడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పరిశ్రమల పేరుతో ప్రభుత్వం సేకరిస్తున్న భూములను కొల్లగొట్టేందుకు అడ్రస్ లేని కంపెనీలను సృష్టించి వాటి పేర్లమీద కాజేస్తున్నారని మండిపడ్డారు. కొండల్‌రెడ్డికి చెందిన టెస్సెరాక్ట్ అనే కంపెనీకి రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో ఐదెకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారని, ప్రస్తుతం మార్కెట్లో ఆ భూమి విలువ సుమారు రూ.200కోట్ల దాకా ఉంటుందని పేర్కొన్నారు. భూ బదలాయింపుపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. గురువారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ సమీపంలోని ఫ్యూచర్‌సిటీలో సీఎం సోదరుడు కొండల్‌రెడ్డికి అక్రమంగా కేటాయించిన భూమిని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కేటీఆర్, హరీశ్‌రావు పరిశీలించారు. తుక్కుగూడ ఓఆర్ఆర్ నుంచి కొండల్‌రెడ్డికి కేటాయించిన భూమి వరకు వందలాది కార్లు, బైకులతో ర్యాలీగా వారు అక్కడికి చేరుకున్నారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బాగుపడింది కేవలం సీఎం సోదరులేనని ఎవరైనా చెప్తారని విమర్శించారు. ముఖ్యమంత్రి ఇటీవల దావోస్‌లో ఇజ్రాయెల్, తదితర దేశాల కంపెనీల నుంచి పెట్టుబడులు తెచ్చేందుకు కుదుర్చుకున్న ఒప్పందాలు కూడా ఆయన సోదరుల కోసమేనని వ్యాఖ్యానించారు.
సీఎం సోదరుల అక్రమాలను అసెంబ్లీలో నిలదీస్తామనే భయంతోనే తనను, తమ పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీ నుంచి బహిష్కరించినా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని స్పష్టంచేశారు. త్వరలోనే రంగారెడ్డి జిల్లాలో ఊరూరా సదస్సులు ఏర్పాటుచేసి బండారాన్ని బయటపెడుతామని చెప్పారు. ముఖ్యమంత్రి సోదరులు కొండల్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి భూ దందాలపై బీజేపీ ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలు చీకటి దొంగలని బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి సోదరులతో పాటు ముఖ్యమంత్రిపై ఈడీ లేదా సీబీఐతో విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

సీఎం సోదరుల అక్రమాలకు తోడుగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా భూ దందాలకు తెరలేపారని కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్, రాఘవ ఎరోస్పేస్ వంటి కంపెనీలతో జిల్లాలోని విలువైన భూములను ఆయన కబ్జాచేస్తున్నారని విమర్శించారు. వీరిపై సమగ్ర విచారణ జరిపే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని తేల్చిచెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తన స్వప్రయోజనాల కోసం పెట్టుకున్న ఫ్యూచర్‌సిటీకి ఫ్యూచర్ లేదని రేపటి రోజుల్లో అది చెల్లదని కేటీఆర్ తెగేసి చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను సీఎం రేవంత్‌రెడ్డి చట్ట విరుద్ధంగా ఫ్యూచర్‌సిటీకి బదలాయించారని మండిపడ్డారు. ఓ వైపు ఫార్మాసిటీ భూముల్లో ఫార్మా కంపెనీలే ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టుకు అఫిడవిట్ ఇచ్చినప్పటికీ ఆ భూములను ముఖ్యమంత్రి అక్రమంగా ఫ్యూచర్‌సిటీకి బదలాయించారని, దీనిపై త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వెల్లడించారు. చట్ట విరుద్ధంగా ఏర్పాటవుతున్న ఫ్యూచర్‌సిటీలో పెట్టుబడులు పెట్టి ఎవరూ మోసపోవద్దని ఫ్యూచర్‌లేని ఫ్యూచర్‌సిటీ ఉండదని స్పష్టంచేశారు.

చదువు లేకున్నా, నిన్నామొన్నటి వరకు ఆవారాగా తిరిగిన అనేకమంది అండదండలతో డిఫెన్స్ కంపెనీలు పెట్టే స్థాయికి ఎదిగారంటూ కేటీఆర్ చురకలంటించారు. అందులో ముఖ్యమంత్రి సోదరులు కూడా ఉన్నారని విమర్శించారు. కంపెనీలకు అడ్రస్లుండవు.. అందులో పెట్టుబడులుండవు.. ఉద్యోగులు కూడా ఉండరని, ఆన్లైన్లో మాత్రం కంపెనీలున్నట్టు సృష్టించి ప్రభుత్వ అండదండలతో రాయితీలు పొందుతున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, వెంకటేశ్, వివేకానంద, తలసాని శ్రీనివాస్ యాదవ్, కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పార్టీ యువ నాయకులు కార్తీక్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): భూమి కోసం, భుక్తి కోసం తిరుగుబాటు చేసిన చాకలి ఐలమ్మ పోరాటం, త్యాగాలు చిరస్మరణీయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. ఆమె వర్ధంతిని పురస్కరించుకొని గురువారం ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఐలమ్మ చూపించిన తెగువ తెలంగాణ ధీరత్వానికి తార్కాణం.. బహుజన పోరాట ప్రతిమకు ప్రతీక అని ఆయన శ్లాఘించారు. వీరనారి గొప్పతనాన్ని చాటిచెప్పేలా కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఆమె జీవితచరిత్రను పాఠ్యాంశంగా చేర్చడంతోపాటు పాలకుర్తి మార్కెట్ యార్డుకు ఐలమ్మ పేరు పెట్టి జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారని గుర్తుచేశారు.