Tiger Nageswara Rao | హీరోకు ఉన్న మార్కెట్ చూసుకొని ఖర్చు పెడితే నిర్మాతలు సేఫ్ జోన్లో ఉంటారు. రిలీజ్ తర్వాత సినిమా తేడా కొట్టినా కూడా ఎక్కువగా నష్టాలు ఉండవు. కానీ మార్కెట్ తో సంబంధం లేకుండా డబుల్ బడ్జెట్ పెట్టి తీస్తే మాత్రం.. ఫలితం తేడా కొడితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. దీనికి ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమాలు నిదర్శనం. అఖిల్ ఏజెంట్ సినిమా కోసం 80 కోట్లు ఖర్చు పెట్టామని నిర్మాత అనిల్ సుంకర ఓపెన్ గా చెప్పారు. తీరా విడుదలైన తర్వాత ఆ సినిమాకు కనీసం 10 కోట్లు కూడా రాలేదు. పైగా చేసిన బిజినెస్ లో 15% కూడా కలెక్ట్ చేయలేదు ఏజెంట్. దానివల్ల నష్టాలు కూడా అదే స్థాయిలో వచ్చాయి. ఇదే ఇబ్బంది గోపీచంద్ రామబాణం, సమంత శాకుంతలం సినిమాలకు కూడా వచ్చాయి. వాటి బడ్జెట్ భారీగా ఉండడంతో నష్టాలు కూడా అంతే భారీగా వచ్చాయి.
ఇదిలా ఉంటే తాజాగా రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా బడ్జెట్ కూడా లిమిట్స్ దాటేసిందనే ప్రచారం ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. కథపై నమ్మకంతో అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాకు ఖర్చు చూడట్లేదని.. క్వాలిటీ మాత్రమే చూస్తున్నాడని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన కార్తికేయ 2, కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు పాన్ ఇండియన్ విజయం సాధించాయి. దాంతో టైగర్ నాగేశ్వరరావు కూడా అలాగే సంచలన విజయం సాధిస్తుందని బలంగా నమ్ముతున్నాడు అభిషేక్. ఈ సినిమా కథ కూడా అంతే పకడ్బందీగా ఉంటుందని.. ప్రపంచానికి తెలియని ఒక బందిపోటు కథ కావడంతో కచ్చితంగా అన్ని ఇండస్ట్రీలో దీనికి ఆదరణ ఉంటుందని నమ్మకంగా చెబుతున్నాడు దర్శకుడు వంశీ. నాలుగేళ్లుగా ఈ సినిమా మీద వర్క్ చేస్తున్నాడు ఈయన. సాధారణంగా రవితేజ సినిమాలకు 30 కోట్ల వరకు బడ్జెట్ అవుతుంది.. కానీ టైగర్ నాగేశ్వరరావు బడ్జెట్ మాత్రం ఇప్పటికే 60 కోట్లు దాటినట్టు తెలుస్తోంది. ప్రమోషన్ తో కూడా కలిపి చూసుకుంటే దాదాపు 75 కోట్ల వరకు ఈ బడ్జెట్ లెక్కలు తేలేలా ఉన్నాయి అనేది ట్రేడ్ వర్గాల మాట.
ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం రవితేజ మార్కెట్ కంటే ఇది డబుల్ ఖర్చు. రేపు సినిమా కూడా డబుల్ బ్లాక్ బస్టర్ అయితే తప్ప నిర్మాత బయటపడటం కష్టం. ఒకవేళ నిర్మాత ఈ సినిమాను సేఫ్ జోన్లో అమ్ముకున్నా డిస్ట్రిబ్యూటర్లకు కూడా కష్టమే అవుతుంది. ఎందుకంటే రవితేజ గత సినిమాల బిజినెస్‌తోనే ఈ సినిమా బిజినెస్ ముడిపడి ఉంటుంది. బడ్జెట్ ఎక్కువ పెట్టాము కదా అని బిజినెస్ ఎక్కువ చేయాలంటే అయ్యే పని కాదు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు వచ్చేసింది టైగర్ నాగేశ్వరరావు. అక్టోబర్ 20న దసరా సందర్భంగా సినిమా విడుదల కానుంది. అదే రోజు బాలకృష్ణ- అనిల్ రావిపూడి భగవంత్ కేసరి, విజయ్-లోకేశ్ కనకరాజ్ లియో, రామ్ – బోయపాటి సినిమాలు కూడా వస్తున్నాయి. ఇంత భారీ పోటీలోనూ చాలా నమ్మకంగా కనిపిస్తున్నాడు రవితేజ. ధమాకా సినిమాతో 100 కోట్లు వసూలు చేసిన ఈయన… మొన్న రావణాసురతో మళ్లీ డీలా పడిపోయాడు దాంతో ఈయన కెరీర్‌కు కూడా టైగర్ నాగేశ్వరరావు కీలకంగా మారింది.
Pooja Hegde | తెలుగులో భారీ చాన్స్ కొట్టేసిన పూజా హెగ్డే.. ఈ సారైనా బాంబే బ్యూటీకి కలిసి వస్తుందా?