Karthikeya | ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా భావించే ఆస్కార్‌ను ‘నాటు నాటు’ పాట గెలవడంతో రెండు తెలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకులు సంబురాలు చేసుకుంటున్నారు. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్ వేదికగా 95వ ఆస్కార్ వేడుకులు అట్టహాసంగా జరిగాయి. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ అవార్డు సాధించింది. షార్ట్ ఫిలిమ్ విభాగంలో భారత్ కు ఇదే తొలి ఆస్కార్ కావడం విశేషం. ఇలా రెండు ఆస్కార్లు ఇండియా గెలుచుకోవడంతో భారతీయ సినీ ప్రేక్షకుల ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. అయితే ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఇండియా నుంచి ఆస్కార్ ఎంట్రీకి అధికారికంగా వెళ్లింది. కానీ ఆర్ఆర్ఆర్ మూవీకి అధికారిక ఎంట్రీ లభించలేదు.
దీనిపై పలు విమర్షలు కూడా వెల్లవెత్తాయి. ఆర్ఆర్ఆర్ను ఆస్కార్ ఎంట్రీకి పంపిస్తే ఖచ్చితంగా ఆస్కార్ తీసుకొచ్చేదని పలువురు సెలబ్రెటీలు సైతం వెల్లడించారు. అయితే ఆస్కార్‌కు అధికారిక ఎంట్రీ లభించలేదని టీమ్ అంతా నిరాశలో ఉన్నప్పుడు.. రాజమౌళి కొడుకు కార్తికేయ జనరల్ కేటగిరిలో ఆర్ఆర్ఆర్ను ఆస్కార్ పంపి క్యాంపెయిన్ చేశాడు. అంతటితో ఆగలేదు. సినిమా గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరిపించాడు. ఈ సినిమాను గ్లోబల్ మార్కెట్‌కు తీసుకెళ్లడంలో పెద్ద పాత్ర కార్తికేయనే పోషించారు. గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ కోసం దగ్గరుండి ప్రమోషన్లు నిర్వహించాడు.
ట్రిపుల్ఆర్ మూవీ ఆస్కార్స్ అవార్డ్స్ జర్నీకి సంబంధించి మార్కెటింగ్ క్యాంపెయిన్‌లో కార్తికేయదే ముఖ్య పాత్ర. తన కృషే ఆస్కార్ విజయాన్ని సాధ్యం చేసింది. అకాడమీ ఓటర్లను అట్రాక్ట్ చేసేందుకు ప్రీమియర్ షోస్, ప్రముఖులతో ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తూ తెర వెనక కష్టపడింది కార్తికేయ. అవార్డు వేదికపై ఆస్కార్ అందుకున్న కీరవాణి కార్తికేయకు మాత్రమే స్పెషల్‌గా థాంక్స్ చెప్పాడు. ఈ ఒక్క విషయం చాలు.. ఆస్కార్ విజయం దాకా ఆర్ఆర్ఆర్ను నడిపించింది ఎవరనేది. ఈ విషయం తెలిసిన పలువురు నెటీజన్లు కార్తికేయను ప్రశంసలతో ముంచేస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి కూడా ఎన్నో ఇంటర్వూలలో కార్తికేయ తన ప్రతీ సినిమాకు బ్యాక్‌బోన్‌లా ఉంటాడని చెప్పాడు.