Mallidi Vasishta | హిట్టయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుందంటే ప్రేక్షకుల్లో ఉండే ఎగ్జైట్మెంట్ అంతా ఇంతా కాదు. అసలు సీక్వెల్‌ను ఎక్కడ నుంచి మొదలు పెడతారు? తొలిపార్టును మించి సీక్వెల్ ఉండబోతుందా? ఇలా ఎన్నో అంతులేని ప్రశ్నలు ప్రతీ ప్రేక్షకుడి మదిలో మెదులుతుంటాయి. మాములుగా టాలీవుడ్లో సీక్వెల్స్ హిట్టయిన సందర్భాలు చాలా తక్కువ. ఎందుకంటే అప్పటికే తొలిపార్టు భీభత్సమైన హిట్టు అయ్యింటుంది. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే భీభత్సానికి మించిన కథ, కథనం ఉండాలి. ఇందులో ఏది సమపాళ్లలో లేకపోయిన ప్రేక్షకులు నిర్మొహమాటంగా సినిమాను తిరస్కరిస్తారు. తెలుగులో అలా తిరస్కరనకు గురైన సీక్వెల్ సినిమాలెన్నో.
కాగా తాజాగా టాలీవుడ్లో ఓ సీక్వెల్ రూపుదిద్దుకుంటుంది. అది కూడా ఇరవై ఏళ్ల కిందటి సినిమా అని ఇన్సైడ్ టాక్. ఇంతకీ ఆ సినిమా ఏంటా? అనుకుంటున్నారా?. అదే 1990లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి. సరిగ్గా ఇరవైమూడేళ్ల కిందట వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ నెలకొల్పిన రికార్డులు అంతా ఇంతా కాదు. అప్పట్లోనే ఈ సినిమా రూ.15 కోట్లు కొల్లగొట్టి మెగాస్టార్ పేరును నార్త్‌లో కూడా వినిపించేలా చేసింది. ఈ సినిమాతో ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన హీరోగా చిరు పేరు మార్మోగిపోయింది. అంతేకాదు ఈ సినిమా తర్వాతే ఇండియాలో తొలిసారి కోటి రూపాయిల పారితోషికం అందుకున్న నటుడిగా చిరు నిలిచాడు.
కే.రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికీ ఓ కలాఖండమే. అప్పట్లోనే ఈ సినిమాకు అశ్వినీదత్ రెండు కోట్లు ఖర్చు పెట్టాడు. కాగా ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ తెరకెక్కబోతున్నట్లు ఇన్సైడ్ టాక్. గతేడాది బింబిసారతో ఇండస్ట్రీలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన వశిష్ట సీక్వెల్ సినిమాను దర్శకత్వం వహించబోతున్నాడట. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీని తన వైపు చూసేలా చేశాడు వశిష్ట. 20కోట్ల మార్కెట్ లేని కళ్యాణ్ రామ్‌ను ఏకంగా 70కోట్ల క్లబ్లో నిలబెట్టాడు. తొలి సినిమాకే కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ తీసుకుని ఎంతో నైపుణ్యంగా తీర్చిదిద్దిన వశిష్ట విజన్‌కు అందరూ ఫిదా అయిపోయారు.
చిరు సైతం దీనికి మినహాయింపు కాదు. మల్లిడి వశిష్ఠ టేకింగ్‌కు ఆశ్చర్యచకితుడై.. ఆయనతోనే సినిమా చేసే దాకా వెళ్లాడు. ప్రస్తుతం మెగా అభిమానులనే కాదు, సగటు ప్రేక్షకుడు సైతం ఈ కాంబోలో తెరకెక్కబోయే సినిమా కోసం అమితాస్తితో ఎదురు చూస్తున్నాడు. కాగా తన కెరీర్లో ఓ మైలు రాయిగా నిలిచిన జగదేక వీరుడుకు సీక్వెల్‌ను ప్లాన్ చేయమని చిరు, వశిష్ఠకు గతంలోనే చెప్పాడట. కాగా ఇటీవలే సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్‌ను సిద్దం చేసుకుని వశిష్ఠ, మెగాస్టార్‌ను కలిశాడట. చిరుకు కథ పిచ్చ పిచ్చగా నచ్చిందట. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయమని చెప్పినట్లు సమాచారం.
ప్రస్తుతం చిరు కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ సినిమా చేస్తున్నాడు. శర్వానంద్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో త్రిష, శ్రీలీలలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వగానే జగదేక వీరుడి సీక్వెల్‌ను పట్టాలెక్కించనున్నాడట. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది.