Allu arjun in Jawan Movie | ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్ సినిమాల్లో ఒక స్టార్ హీరో గెస్ట్ రోల్ పోషించడం సర్వ సాధారణమైపోయింది. దానివల్ల సినిమాపై ఎక్కడలేని హైప్ క్రియేట్ అవుతుంది. కాగా షారుఖ్ నటిస్తున్న ‘జవాన్’లోనూ ఓ పాన్ ఇండియా హీరో గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు సమాచారం. ఎన్నో ఏళ్లుగా ఒక మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న షారుఖ్‌కు పఠాన్ తిరుగులేని విజయాన్నిచ్చింది. ప్రస్తుతం అదే జోష్‌తో అట్లీ దర్శకత్వంలో జవాన్ పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా తాజాగా ఈ సినిమాలో ఓ స్టార్ హీరో గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇంతకీ ఎవరా స్టార్ హీరో అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప-2తో బిజీగా గడుపుతున్న బన్నీ జవాన్‌లో గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు టాక్. ఇప్పటికే అట్లీ, అల్లు అర్జున్ను కలిసి తన రోల్ గురించి చెప్పాడట. బన్నీకి పాత్ర నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. ఇక బన్నీ లైనప్‌లో అట్లీ కూడా ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కాగా అట్లీ కూడా యూనివర్స్ ప్లాన్ చేస్తున్నట్లు, అందులో భాగంగానే క్లైమాక్స్‌లో బన్నీని నటింపజేయాలని అనుకుంటున్నాడట. ఇక తమిళ హీరో విజయ్ కూడా ఈ సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నాడు.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో షారుఖ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. నయనతార ఇన్వెస్టిగేటీవ్ ఆఫీసర్ పాత్ర పోషించనుంది. విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను రెడ్ చిల్లీస్ బ్యానర్‌పై షారుఖ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 2న విడుదల కానుంది.