విశ్వ కార్తికేయ, శరణ్, అవంతిక, అర్చన గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఐపీఎల్’. బీరం వరలక్ష్మి సమర్పణలో అంకిత మీడియా హౌస్ పతాకంపై బీరం శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. సురేష్ లంకలపల్లి దర్శకుడు. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం తాజాగా హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు సురేష్ లంకలపల్లి మాట్లాడుతూ..‘దేశం మీద ఉన్న ప్రేమతో ఈ సినిమా రూపొందించాం. ఆ ప్రేమ ఎంత బలమైనదో చూపిస్తున్నాం. మంచి సందేశంతో పాటు సినిమాలో ప్రేక్షకులకు నచ్చే అంశాలుంటాయి. లాక్డౌన్లో ఎన్నో ఇబ్బందులు వచ్చినా..నిర్మాత సహకారంతో సినిమా పూర్తిచేశాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు సుమన్, దర్శకుడు సముద్ర, ఇతర చిత్రబృందం పాల్గొన్నారు. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, పృథ్వీ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : వెంగి, సినిమాటోగ్రఫీ : ఏకే ఆనంద్.