నరేష్, రాహుల్ రామకృష్ణ, నవ్యస్వామి, సురభి ప్రభావతి, గంగవ్వ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇంటింటి రామాయణం’. సురేష్ నరెడ్ల దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, మారుతి టీమ్ సమర్పణలో ఐవీవై ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. వెంకట్ ఉప్పటూరి, గోపీచంద్ యిన్నమూరి నిర్మాతలు. త్వరలో థియేటర్లలో విడుదలకానుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రతి కుటుంబం చూడాల్సిన చిత్రమిది. విభిన్న కథాంశంతో తెరకెక్కించాం. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి చూస్తే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు. మనందరి వ్యక్తిత్వాలను తెరపై చూపించే చిత్రమిదని రాహుల్ రామకృష్ణ పేర్కొన్నారు. ఇంటిల్లిపాదికి కనెక్ట్ అయ్యే కథాంశమిదని దర్శకుడు మారుతి తెలిపారు.
నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ‘తెలంగాణ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. చక్కటి భావోద్వేగాలు, కావాల్సినంత వినోదంతో ఆకట్టుకుంటుంది’ అన్నారు. సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ ‘తెలంగాణ నేపథ్యంలో నడిచే కథ ఇది. మట్టి వాసన నచ్చే ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది. గ్రామీణ ఇతివృత్తంగా అందరిని మెప్పిస్తుంది’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: పి.సి.మౌళి, సంగీతం: కల్యాణి మాలిక్, నేపథ్య సంగీతం: కామ్రాన్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకుడు: సురేష్ నరెడ్ల.