వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు సుధీర్ బాబు. ఆయన నటించిన తాజా సినిమా ‘హంట్’. శ్రీకాంత్, తమిళ నటుడు భరత్ కీలక పాత్రలు పోషించారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి ఆనందప్రసాద్ నిర్మించారు. మహేష్ దర్శకత్వం వహించారు. రేపు ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపారు సుధీర్ బాబు.
ఈ చిత్రంలో మీ వేట ఎవరి కోసం?
కథలో నేను ఎవరిని వేటాడుతున్నాను అనే విషయం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ప్రతి పాత్రను అనుమానిస్తూ ఉంటాను. ప్రేక్షకులు నా పాత్రతో పాటే ప్రయాణిస్తూ సరికొత్త విషయాలు తెలుసుకుంటారు. ఎంగేజింగ్ థ్రిల్లర్‌గా ఉంటుంది.
యాక్షన్‌తో పాటు ప్రాధాన్యత ఉన్న ఇతర అంశాలేమిటి?
ఈ సినిమాలో మంచి యాక్షన్ సీక్వెన్సులు ఉన్నాయి. అయితే అవి ఎంత వరకు ఉండాలో అంత వరకే ఉంటాయి. ప్రధాన కథంతా భావోద్వేగాల చుట్టూనే తిరుగుతుంది. ప్రేమ కథ ఉండదు. కేవలం స్నేహితుల మధ్య ఎమోషన్స్ ఉంటాయి.
గతం మర్చిపోవడం అనే పాయింట్ క్లిష్టమైంది కదా?
ఇందులో అర్జున్ అనే క్యారెక్టర్ చేశాను. ఇది ఏ, బీ అనే రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి గతం మర్చిపోకముందు, మరొకటి గతం మర్చిపోయిన తర్వాత. మొదటి పాత్ర చాలా స్పష్టంగా ఉంటుంది. నటించేందుకు ఇబ్బంది పడలేదు. కానీ రెండో పాత్రలో నటించేందుకు కష్టపడ్డాను. ‘గజినీ’ ఛాయలు గుర్తురాకుండా ఉండేందుకు ప్రయత్నించాను.
ఈ సినిమా విజయం మీద మీకు ఎలాంటి అంచనాలున్నాయి?
రొటీన్‌కు భిన్నంగా ఉండే చిత్రమిది. హీరోయిన్స్, డ్యూయెట్స్ ఉండవు. అక్కడే రూల్స్ బ్రేక్ చేశాం. లాంగ్ యాక్షన్ సీక్వెన్సులు ఆకట్టుకుంటాయి. సినిమా ప్రారంభమైన రెండు నిమిషాల్లోనే ప్రేక్షకులు కథలోకి వెళ్లిపోతారు. ఈ చిత్రాన్ని ఇప్పటికే చాలా మంది చూశారు. అందరికీ నచ్చింది. కొత్త తరహా చిత్రాలకు ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమాను ఆదరిస్తారనే ఆశిస్తున్నాం.
మీ తదుపరి చిత్రాల గురించి చెప్పండి
నటుడు హర్షవర్థన్ దర్శకత్వంలో ‘మామా మశ్చీంద్ర’ అనే చిత్రంలో నటిస్తున్నాను. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. ఇంటెన్స్ డ్రామా ఉంటుంది. ఈ చిత్రంలో త్రిపాత్రాభినయం చేస్తున్నాను. యూవీ క్రియేషన్స్ సంస్థలో మరో సినిమా ఉంది. పుల్లెల గోపీచంద్ బయోపిక్కు సమయం పడుతుంది.