కోచికోడ్: కాంతార చిత్రంలోని వరాహరూపం సాంగ్(Varaha Roopam Song) సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ సాంగ్‌పై ఇవాళ కేరళ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పదమైన వరాహరూపం పాటను .. థియేటర్లు, ఓటీటీ, డిజిటల్ స్ట్రీమింగ్‌లో వాడడం నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాపీరైట్ చట్టం ప్రకారం ఉల్లంఘన జరిగినట్లు కోర్టు తన ఇంజెంక్షన్ ఆదేశాల్లో పేర్కొన్నది.
ఫస్ట్ అడిషనల్ జిల్లా కోర్టు జడ్జి కే ఈ సాలిహి ఈ ఆదేశాలు జారీ చేశారు. మ్యూజిక్ బ్యాండ్ తైకుదం బ్రిడ్జ్, మాతృభూమి ప్రింటింగ్‌కు వరాహరూపం పాట క్రెడిట్ ఇవ్వాలని కోర్టు తెలిపింది. నవరసం ట్రాక్ ఆధారంగా ఈ ఆదేశాలు జారీ చేశారు. నవరసం ట్రాక్‌ను కాపీ కొట్టి వరాహరూపం తీసినట్లు కోర్టు పేర్కొన్నది.
గత ఏడాది సెప్టెంబర్‌లో కాంతారా సినిమా రిలీజైన విషయం తెలిసిందే. ఆ నాటి నుంచి వరాహరూపం పాటపై కాపీరైట్ ఆరోపణలు ఉన్నాయి. తైకుదం బ్రిడ్జ్ రూపొందించిన నవరసం నుంచే ప్రేరణ పొంది వరాహరూపం పాటను క్రియేట్ చేసినట్లు మ్యూజిక్ డైరెక్టర్ అంగీకరించారని కోర్టు తెలిపింది.