Indra Movie Re Release | మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఇంద్ర సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్లు వైజయంతి మూవీస్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా రీ రిలీజ్ వాయిదా పడనున్నట్లు తెలుస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాలలో ఇంద్ర ఒకటి. అప్పటివరకు ఫ్యాక్షన్ సినిమాలు బాస్‌కి సెట్ కావు.. మాస్ కామెడీ సినిమాలకే మాత్రమే సెట్ అవుతాయి అన్న నోళ్లని ఈ సినిమాతో మూయించాడు మెగాస్టార్. దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించగా చిన్ని కృష్ణ కథను రాశాడు. 2002 జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాదాపు ఆ రోజుల్లోనే రూ.55 కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే ఈ సినిమా రీసెంట్గా 22 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఆగష్టు 22న ఇంద్ర సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఈ చిత్రం రీ రిలీజ్ వాయిదా పడబోతున్నట్లు తెలుస్తుంది.
ఎందుకంటే ఈ సినిమాకు వారం ముందు నాలుగు సినిమాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. ఇందులో మూడు (మిస్టర్ బచ్చన్, తంగలాన్, డబుల్ ఇస్మార్ట్) పెద్ద సినిమాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమా విడుదలైన వారం రోజులకే రీ రిలీజ్ ఉండడంతో ఇంద్ర ఎఫెక్ట్ ఈ సినిమాలపై ఉంటుందని ముఖ్యంగా కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇంద్రలో సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్స్ గా నటించగా.. ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో నటించాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించాడు.