‘నేను నా ఆరోగ్యం గురించి సోషల్‌మీడియాలో రకరకాల వార్తలు చూశాను. అయితే ప్రస్తుతానికి నేను చావలేదు (నవ్వుతూ). ఆ హెడ్డింగ్స్ అప్రస్తుతం. నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. ఫైట్ చేస్తున్నాను. నేను ఉన్న పరిస్థితిలో అది అంత ప్రాణాంతకం ఏమీ కాదు’ అన్నారు కథానాయిక సమంత. ఆమె నటించిన తాజా చిత్రం ‘యశోద’ ఈ నెల 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.అయితే ప్రస్తుతం సమంత ‘మయోసైటిస్’ అనే వ్యాధితో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రచారంలో భాగంగా సమంతకు సంబంధించిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ఇంటర్వ్యూలో సినిమా విశేషాలతో పాటు తన హెల్త్కండిషన్ గురించి కూడా తెలియజేశారు సమంత. ఆమె మాట్లాడుతూ ‘ఇప్పుడు నేను రికవరీ అవుతున్నాను.
త్వరలో పరిస్థితులు మెరుగు అవుతాయని ఆశిస్తున్నాను. ఈ క్షణం నేను ఈ రోజు గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. ‘యశోద’ విడుదల గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని మంచి రోజులు, చెడ్డరోజులు ఉంటాయి. ఒక్కోరోజు ఇంకొక్క అడుగు కూడా ముందుకు వేయలేనేమో అనిపిస్తున్నది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత దూరం వచ్చానా? అనిపిస్తున్నది (భావోద్వేగానికి లోనవుతూ). చాలా మంది ఎన్నో సవాళ్లతో యుద్ధం చేస్తున్నారు. అందరి ఆశీస్సులు, మద్దతుతో అంతిమంగా మనమే విజయం సాధిస్తాం’ అన్నారు.
అందుకే స్లైన్ బాటిల్స్‌తో డబ్బింగ్ చెప్పాను
కథ విన్న వెంటనే ఓకే చేసిన సినిమా ‘యశోద’. ఈ సినిమాలో పాత్ర నాకు చాలా బాగా నచ్చింది. ఒక మంచి థ్రిల్లర్ ఇది. థియేటర్లో ప్రేక్షకులు కూడా తప్పకుండా థ్రిల్ల్ అవుతారని నమ్ముతున్నా. తప్పకుండా థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. ఈ చిత్రం యాక్షన్ పరంగా కూడా కొత్తగా ఉంటుంది. ఈ చిత్రంలో నేను సింపుల్ ప్రెగ్నెంట్ లేడీగా కనిపిస్తాను. ఆ పాత్రకు తగ్గట్టు యాక్షన్ డిజైన్ చేశారు. ‘యశోద’కు డబ్బింగ్ చెప్పాలని ముందు నుంచి అనుకున్నాను. ఒక్కసారి నిర్ణయించుకుంటే చేయాల్సిందే..నాలో పట్టుదల, మొండితనం ఎక్కువ. అందుకే ఆరోగ్యం సహకరించికపోయినా స్లైన్ బాటిల్‌తో డబ్బింగ్ చెప్పాను. సవాళ్లు ఎదురైనప్పటికీ డబ్బింగ్ చెప్పగలిగినందుకు సంతోషంగా ఉంది. ‘యశోద’ అనే కొత్తకథను దర్శకులు హరి, హరీష్ ప్రజెంట్ చేసిన విధానం ఎంతో బాగుంటుంది. సినిమా గొప్పగా వుండాలని తపించే నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమా ఖర్చు విషయంలో ఎక్కడా వెనుకాడకుండా నిర్మించారు’ అన్నారు.