ముంబై: ధురంధర్(Dhurandhar) సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకెళ్తున్నది. ఆ ఫిల్మ్ కలెక్షన్ల జోరు తగ్గడం లేదు. తాజాగా ఆ ఫిల్మ్ ఓ కొత్త రికార్డు క్రియేట్ చేసింది. అత్యధిక వసూళ్లు చేసిన హిందీ భాష చిత్రంగా ధురంధర్ ఘనత సాధించింది. ఇప్పటి వరకు హిందీ భాషలో ధురంధర్ సినిమా రూ.1240 కోట్లు ఆర్జించినట్లు ఫిల్మ్ మేకర్స్ పేర్కొన్నారు. ఆదిత్య థార్ డైరక్షన్లో వచ్చిన ధురంధర్ సినిమా ప్రస్తుతం సంచలనాలు నమోదు చేస్తున్నది. జియో స్టూడియోస్ ప్రకారం ఆ ఫిల్మ్ కేవలం హిందీ భాషలోనే ఇప్పటి వరకు 1240 కోట్లు ఆర్జించింది. భారత్‌లో ఇప్పటి వరకు 968 కోట్లు ఆర్జించింది. ఇక విదేశాల్లో ఆ సినిమాకు 272 కోట్లు వచ్చాయి.
ధురంధర్ 2 చిత్రాన్ని మాత్రం హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఆ ఫిల్మ్ ఈ ఏడాది మార్చి 19న రిలీజ్ కానున్నది. అయితే తొలి పార్ట్‌కు విపరీతమైన డిమాండ్ ఉన్న కారణంగా.. ఆ ఫిల్మ్ సీక్వెల్‌ను పలు ఇతర భారతీయ భాషల్లో రిలీజ్ చేసే ఉద్దేశంతో నిర్మాతలు ఉన్నారు. రిలీజైన తర్వాత ధురంధర్ చిత్రం హిందీ భాషలో పలు రికార్డులు నెలకొల్పింది. కేవలం 16 రోజుల్లోనే ఇండియాలో 500 కోట్లు వసూల్ చేసింది. ఇది బాలీవుడ్లో రికార్డు. ఇక ఆ తర్వాత అదే వేగంతో 600, 800, వెయ్యి కోట్ల క్లబ్‌కు చేరుకున్నది.