Hyderabad IMAX | హైదరాబాద్ సినిమా ప్రేమికుల దశాబ్ద కాలపు నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడబోతుంది. భాగ్యనగరానికి ఐమాక్స్ (IMAX) ఫార్మాట్ అధికారికంగా తిరిగి వస్తున్నట్లు ఐమాక్స్ కార్పొరేషన్ మరియు ప్రముఖ సినిమా చైన్ ఏషియన్ సినిమాస్(Asian Cinemas) సంయుక్తంగా ప్రకటించాయి. గతంలో ప్రసాద్స్ ఐమాక్స్‌లో ఈ ఫార్మాట్ నిలిచిపోయిన తర్వాత, సుమారు 11 ఏళ్లుగా హైదరాబాద్ ప్రేక్షకులు సరైన ఐమాక్స్ స్క్రీన్ కోసం ఎదురుచూస్తున్నారు.
అయితే తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం, సూపర్ స్టార్ మహేష్ బాబు, దగ్గుబాటి ఫ్యామిలీ, ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ భాగస్వామ్యంతో కూడిన ఏఎంబీ సినిమాస్ (AMB Cinemas) బ్రాండ్ కింద భారతదేశంలో మూడు సరికొత్త ఐమాక్స్ విత్ లేజర్ (IMAX with Laser) స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో రెండు స్క్రీన్లు హైదరాబాద్‌లోనే అందుబాటులోకి రానున్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని చారిత్రాత్మక సుదర్శన్ 70MM థియేటర్ స్థానంలో నిర్మితమవుతున్న ‘ఏఎంబీ క్లాసిక్’ (AMB Classic) లో నగరంలోనే మొదటి సరికొత్త ఐమాక్స్ స్క్రీన్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ స్క్రీన్ 2026 చివరి నాటికి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. మిగిలిన రెండు లోకేషన్లను 2028 నాటికి పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు.
4K విజువల్స్, అత్యాధునిక ప్రొజెక్షన్ టెక్నాలజీ, అద్భుతమైన సౌండ్ సిస్టమ్‌తో అత్యంత లీనమయ్యే అనుభూతిని అందించేలా ఈ లేజర్ స్క్రీన్లను డిజైన్ చేస్తున్నారు. ముఖ్యంగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ విడుదలకు ముందే ఈ ఐమాక్స్ థియేటర్ అందుబాటులోకి రానుండటంతో టాలీవుడ్ సినీ వర్గాల్లో మరియు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హైదరాబాద్ ప్రేక్షకుల సినిమా పిచ్చినే నమ్ముకుని సరికొత్త టెక్నాలజీతో వస్తున్న ఈ సరికొత్త థియేటర్ మళ్లీ పాత ఐమాక్స్ లీనమయ్యే మ్యాజిక్‌ను రీక్రియేట్ చేయబోతోందని ఏషియన్ సినిమాస్ అధినేతలు సునీల్ నారంగ్, భరత్ నారంగ్ సంతోషం వ్యక్తం చేశారు.